అంతర్జాతీయం (International) వార్తలు (News)

రోడ్‌ ఆఫ్‌ బోన్స్ (ఎముకల రహదారి) ఎక్కడ ఉంది?

రష్యాలోని కొలిమా ప్రాంతంలో బంగారు గనులు, ఇతర ఖనిజాలు పుష్కలంగా లభ్యం అయ్యేవి. వాటిల్లో పని చేయాలంటే మాములు పనివారు ఎవరు వచ్చేవారు కాదు దానితో అక్కడి రాజకీయ ఖైదీలతో ఆ పని చేయించేవారు. కాకపోతే అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది అదేంటంటే.. అప్పట్లో ప్రధాన నగరంగా ఉండే కబరోస్క్‌ నుంచి కొలిమా ప్రాంతానికి వెళ్లడానికి, అక్కడ వెలికి తీసిన బంగారాన్ని తీసుకురావడానికి సముద్రమార్గం ఒక్కటే ఉండేది. ఓడల్లో రవాణా చాలా ఆలస్యమవుతుండటంతో ఒక రోడ్డు నిర్మాణం చేపట్టాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది.

కబరోస్క్‌ నుంచి నీషి బెస్ట్‌యాక్‌ వరకు అప్పటికే రహదారి ఉంది. దీంతో నిషీ బెస్ట్‌యాక్‌ నుంచి కొలిమా వరకు, అక్కడి నుంచి తీరప్రాంతమైన మగడాన్‌ వరకు రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. దీని పొడవు 2,031కి.మీ. ఈ రోడ్డు నిర్మాణానికి కూడా రాజకీయ ఖైదీలనే పురమాయించాలని స్టాలిన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో కొలిమా ప్రాంతంలో రాజకీయ ఖైదీలతో 80 క్యాంప్‌లు ఏర్పాటు చేసి 1932లో నిర్మాణ పనులు మొదలుపెట్టారు.
రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్‌ 50 డిగ్రీల్లో ఉండేది పైగా వేసవికాలం కావడంతో దోమలు ఖైదీలపై దాడి చేసి రక్తం పీల్చేసేవి. ఇలా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తూ రోజుకు కనీసం పాతికమంది ఖైదీలు మరణించేవారట. వారిని వెనక్కి తీసుకెళ్లి, అంతిమ సంస్కారాలు జరిపించాలంటే ఆలస్యం అవుతుంది కాబట్టి చనిపోయిన వారిని చనిపోయిన చోటే దారిలో కానీ దారి పక్కన గుంతలు తవ్వి కానీ అందులో పాతిపెట్టేసి వాటిపై రోడ్డు వేసేవారు. 2వేల కి.మీ మేర పొడవున్న ఆ రోడ్డు రెండున్నర లక్షల మందిని బలితీసుకుంది. అయినా కూడా వారికి ఎలాంటి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా అదే దారిలోనే పాతిపెట్టి మృతదేహాలపై రోడ్డు వేయడం. అందుకే దాన్ని ఎముకల రహదారి(రోడ్‌ ఆఫ్‌ బోన్స్‌)అని పిలుస్తుంటారు.అలా మీటరుకో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తవడానికి 20ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో 2.5లక్షల మందికిపైగా ఖైదీలు మృతి చెందారని, వారందరినీ రోడ్డు కిందే పాతిపెట్టారని చరిత్రకారులు చెప్తున్నారు.

ఇప్పటికీ ఈ రోడ్డు P504 జాతీయ రహదారిగా ప్రయాణికులకు అందుబాటులో ఉంది కానీ ఈ రోడ్డపై ప్రయాణించడమంటే రిస్క్‌ తీసుకున్నట్లే. ఎందుకంటే ఈ రోడ్డు శీతాకాలం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ తర్వాత మంచు కరిగి రోడ్డుపై గుంతలు ఏర్పడతాయి. మరోవైపు దారిపొడవున ఎలుగుబంట్లు దాడి చేసే అవకాశాలున్నాయి. అయినా, కొంతమంది సాహస యాత్రికులు ఈ రోడ్డుపై ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రయాణానికి జీపులు అనువుగా ఉంటాయి. అందుకే, మగడాన్‌లో వీటిని అద్దెకి కూడా ఇస్తుంటారు. అలాగే, స్థానిక గైడ్స్‌ కొలిమా హైవే టూర్స్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తూ దీనిని ఒక పర్యాటక కేంద్రంగా మార్చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.