అంతర్జాతీయం (International) వార్తలు (News)

మెక్సికో నుండి అమెరికా వలసదారుల దయనీయస్థితి..??

ఆగ్నేయ మెక్సికోలో ఒక హైవేపై చనిపోయిన వ్యక్తి పక్కనే సగం చిరిగిన బట్టలతో వైల్డర్ లాడినో గార్సియా అనే పసివాడు నిల్చుని కనిపించాడు. ఆరా తీయగా రెండేళ్ల వైల్డర్ తన తండ్రి ఇసిడ్రో లాడినోతో కలిసి, హోండురస్‌లోని శాంటారీటా అనే చిన్న ఊరి నుంచి అమెరికా పయనం కాగా మార్గమధ్యలో తండ్రి నుంచి వైల్డర్ తప్పిపోయాడు. జూన్ 28న వైల్డర్ లాడినో గార్సియా మరో వందమంది వలసదారులతోపాటు కంటైనర్‌లో కూర్చుని ప్రయాణించాడు. ఆ కంటైనర్ మూసి ఉండడంతో సరైన గాలి, వెలుతురు లేక ప్రయాణికులు అల్లాడిపోయారు.

వాహనం లోపల విపరీతమైన వేడి, సరిగా గాలి ఆడకపోవడంతో వలసదారుల్లో డీహైడ్రేషన్, ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు కనిపించాయి. దురదృష్టవశాత్తు వారిలో ఒక 25 ఏళ్ల యువకుడు చనిపోయాడు అని నేషనల్ మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎన్ఎం) ఒక రిపోర్టులో తెలిపింది. కంటైనర్‌ లోపల కూర్చున్నవారిలో ఒకరి తరువాత ఒకరు స్పృహ తప్పిపోవడం మొదలుపెట్టారు. దాంతో బండి ఆపమని మిగతావారు గోల చేశారు. కొంతసేపయ్యాక కంటైనర్ ఆపారు. వారికి గైడుగా వ్యవహరిస్తున్న వ్యక్తి వాహనం వెనుక భాగం తలుపులు తెరిచారు. వెంటనే లోపల ఉన్నవారు బయటకు దూకి గాలి కోసం పరుగులు తీశారు. అధికారులు అక్కడకు చేరుకునేసరికి ఎనిమిది మంది ఇంకా అక్కడే ఉన్నారు. కొంతమంది లోపల పడిపోయి ఉన్నారు. వైల్డర్ లాంటి వాళ్లు రోడ్ల మీద దొరికారు. చిరిగి పోయిన దుస్తులతో రోడ్డు పక్కన వైల్డర్ కనిపించాడు. ఆ బాబు ఎవరో తమకు తెలీదని మిగిలిన వారు చెప్పారు.

వైల్డర్ తప్పిపోయాడన్న వార్త విని ఏడ్చానని ఆ చిన్నారి తల్లి లొరేనా గార్సియా చెప్పారు.
అయితే తన బాబు మళ్లీ దొరకడం, భర్త కూడా క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నానని ఆమె అన్నారు. తండ్రీ కొడుకులిద్దరినీ అమెరికాలోకి అనుమతించమని లొరేనా అభ్యర్థించారు. మైనర్లతో పాటు వెళితే, వెంట వచ్చినవాళ్లని కూడా సరిహద్దుల వద్ద అమెరికా లోనికి అనుమతిస్తారని ఇసిడ్రో దంపతులు విన్నారు. అందుకే కొడుకుని తీసుకుని జూన్ 25న బయలుదేరారు.

వాళ్ల ఊరు శాంటారిటా ప్రాంతం పేదరికంతో అల్లాడుతోంది. 2020లో ఈటా, ఐయోటా తుపానుల తరువాత ఆ ప్రాంత వాసుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జూన్ 27న తండ్రీకొడుకులిద్దరూ గ్వాటెమాల, మెక్సికో మధ్య ఉన్న సరిహద్దులు దాటారు. ఆ తర్వాత వారి సమాచారం తనకు తెలియలేదని లొరేనా గార్సియా చెప్పారు.

జూన్ 29న లొరేనాకు తన భర్త, బిడ్డ క్షేమ సమాచారాలు తెలిశాయి. “వైల్డర్ బాగానే ఉన్నాడుగానీ బాబును థెరపిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లాల్సి వచ్చిందని చెప్పారు” అని లొరేనా వివరించారు. వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపించే బాధ్యతను ఐఎన్ఎం తీసుకుంటుంది. అయితే వాళ్లను వెనక్కు పంపకుండా అమెరికాకు పంపించాలని లొరేనా కోరుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 19,000 మంది మైనర్లు ఒంటరిగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించారని అమెరికా అధికారులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •