వార్తలు (News)

నేడు సీఎం కేసీఆర్‌ యాదాద్రి యాత్ర!!

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించేందుకు నేడు సీఎం కేసీఆర్‌ యాదాద్రి కి రానున్నారు. ఐదున్నర ఏళ్ల కిందట ప్రారంభమైన యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తవ్వడంతో త్వరలో ప్రధానాలయంలో లక్ష్మీనారసింహుడు భక్తులను దర్శనమివ్వనున్నారు. ఆలయ ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన పనులు కొనసాగుతుండగా స్వామి వారి కైంకర్యాలకు ఉద్దేశించిన పుష్కరిణిని సిద్ధం చేశారు. దిగువన మరో పుష్కరిణి కూడా పూర్తి కావస్తోంది. నలుదిక్కులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం కూడా సిద్ధమైంది.

సీఎం కేసీఆర్ చినజీయర్ స్వామిని మరోసారి సంప్రదించి ఆలయ పున: ప్రారంభంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం నిర్ణయానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా పూర్తైంది. 15 కాటేజీల అన్ని పనులు పూర్తయ్యాయి. కేసీఆర్ ఆదేశాలతో మరో వారం రోజుల్లో పూర్తవుతుందని యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ కిషన్ రావు చెబుతున్నారు. కల్యాణకట్ట కొద్దిరోజుల్లో సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర రెండు వేల వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం కల్పించామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఘట్ కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్ ట్రైన్ ను యాదాద్రి వరకు పొడిగించేందుకు కేంద్ర రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. యాదాద్రి గుట్ట కింది నుంచి ఆలయం దగ్గరకు ఫ్రీ ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా మూడు హెలిప్యాడ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •