నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటుతుండడంతో సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నాడు. ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్లాలంటే పెద్ద పెద్ద నోట్లు ఖర్చుపెట్టవలసి రావడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. ఏ సరుకు ధర చూసినా మండిపోతుంది. అసలే ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజల పై ఈ ధరల పెరుగుదల పెనుభారాన్ని మోపుతోంది. రోజూ మనం నిత్యం వినియోగించే పప్పు, బియ్యం, ఉల్లి, కూరగాయలు, నూనెల రేట్ల ధరలు సైతం చుక్కలనంటే స్థాయిలో దూసుకెళుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే నిత్యావసరాల ధరలు రెట్టింపు కావడంతో మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సన్‌ఫ్లవర్‌ నూనె లీటరు రూ.190కు పెరగగా మిగిలిన వంట నూనెలు వందకు పైగా ధరలు పెరగడంతో పేదలు, సామాన్య ప్రజల బతుకు జీవనం కష్టంగా మారింది. ఉల్లిపాయ లేనిదే కూర రుచించదు. అయితే దీని ధర కొండెక్కడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. రిటైల్‌ బహిరంగ మార్కెట్‌లో ఉల్లి రూ.40 నుంచి రూ.50 వరకూ పలుకుతోంది. గత ఏడాదిలో ఇదే సమయంలో కందిపప్పు ధర రూ. 90 నుంచి రూ.95 ఉండగా అదిప్పుడు రూ.150కి ఎగబాకింది. ఒక కిలో మినపప్పు రూ.160కు చేరింది. మార్కెట్‌లో బియ్యం ధర కూడా రెండు నెలల క్రితం వరకు సోనా మసూరి ప్రథమ శ్రేణి కొత్త బియ్యం 25 కేజీలు రూ. 12.50లు ఉండగా, ప్రస్తుతం రూ.1400కు చేరింది. ఇక సామాన్యుడు ఎలా బ్రతకాలో ప్రభుత్వాలే చెప్పాలి.