హైదరాబాద్ నగరం ఒక్కసారిగా జనాలు లేక బోసిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులన్నీ జనం లేక నిర్మానుష్యంగా మారాయి. వాహనాల మోతతో దద్దరిల్లే రోడ్ల పైన ఎలాంటి శబ్దం లేదు. లాక్ డౌన్ గానీ అమలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగమూ తగ్గింది. సాధారణ రోజుల్లో నిత్యం 55 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వాడకం ఉంటుంది. నాలుగైదు రోజులుగా విద్యుత్‌ వినియోగం 47 మిలియన్‌ యూనిట్లలోపే ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఇక.. మెట్రో రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ రెండు రోజులుగా భారీగా తగ్గింది.

గర పరిధిలోని నాగోలు-రాయదుర్గం, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌, ఎల్‌బీ నగర్‌-మియాపూర్‌ మార్గాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 11.15 వరకు 66 స్టేషన్ల నుంచి రోజుకు 820 ట్రిప్పులను నడిపిస్తున్నారు. ఈ మూడు కారిడార్ల పరిధిలో రోజుకు సగటున 2.50 నుంచి 2.70 లక్షల మంది ప్రయాణిస్తారు. బుధ, గురువారాల్లో ఆ సంఖ్య 1.5 లక్షలకు తగ్గిపోయింది. రెండు, మూడు రోజులుగా.. 2లక్షల నుంచి 3లక్షల మేర వాహనాలు అదనంగా వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. నగరంలోని బస్టాండ్లు.. రైల్వే స్టేషన్ల నుంచి లక్షలాది మంది ప్రయాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి 3.30 లక్షల మంది తరలివెళ్లినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. ఆర్టీసీ బస్సుల ద్వారా 1.80 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు.