సంక్రాతి అంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగే కోడిపందాలు గుర్తు వస్తాయి. అయితే ఈసారి కరోనా కారణంగా అలంటి అవకాశం లేదనుకున్నవారి ఆలోచనలు తల్లక్రిందులు చేస్తూ ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. భీమవరం నుంచి అమలాపురం వరకు భారీగా పందాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పశ్చిమ గోదావరి ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో గుండాట, పేకాట, కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్ లో పామాయిల్ తోటలో బరులు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, కొయ్యలగూడెం మండలాల్లో కోళ్లు కత్తులు దూసుకుంటున్నాయి.
దానికితోడు కోడిపందాల దగ్గర మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పందెం బరులు చూస్తుంటే జాతరను తలపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇదే సందడి కొనసాగనుంది. బరుల దగ్గర ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. చాలామంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. సోషల్ డిస్టెన్స్ అనే పదం ఒకటుందనే విషయమే పూర్తిగా విస్మరించారు.
భీమవరం, ఉండి, వెంప, తణుకు, దెందులూరు, రావులపాలెం, అమలాపురంలో భారీగా బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అలాగే రామచంద్రాపురం, ముమ్మిడివరం, కాకినాడ, రాజోలు, ఐ.పోలవరం, రాజానగరంలోనూ పందాలు కొనసాగుతున్నట్టు సమాచారం.