‘వ్యాపారాలు నడపడం ప్రభుత్వం పనికాదు.” 2014లో అమెరికాలో భారత్-అమెరికా బిజినెస్ కౌన్సిల్‌ సమావేశంలో ప్రసంగిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. 

అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో 2004లో మొదలైన పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని ఆనాడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం భావించింది.

తాజాగా 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ టార్గెట్‌ కంటే ఎక్కువగానే పెట్టుబడులను వెనక్కి తీసుకోగలమని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తంచేస్తోంది. 

జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ నుంచి ఐపీవోను కూడా తీసుకువస్తున్నట్లు బడ్జెట్‌లోనే ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్‌లలోనూ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుందని నిర్మల పేర్కొన్నారు. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ బ్యాంకుల్లో తమ వాటాను కూడా విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

అయితే, ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణపై ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే చాలా వర్గాల నుంచి నిరసన వ్యక్తమైంది. ఇది సరైన చర్యకాదని చాలా మంది వ్యాఖ్యానించారు. ఇదివరకు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినవారు సైతం ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణపై ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఈ విషయంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా స్పందించింది. ”ఆర్థిక లోటును పూడ్చడానికి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ బీమా సంస్థలో వాటాను విక్రయించండి. కావాలంటే ఎల్‌ఐసీ ఐపీవోను కూడా తీసుకురండి. అంతేకానీ, పెట్టుబడుల ఉపసంహరణ కోసం నీతీఆయోగ్‌ను కంపెనీల జాబితాను సిద్ధం చేయమని అడగడం, 

వ్యూహాత్మక, రంగాల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతులు ఇవ్వడం సరికాదు. దీని వల్ల ఆత్మ నిర్భర భారత్ లక్ష్యాలపై ప్రభావం పడే అవకాశముంది”అని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. 

గతేడాది కోవిడ్-19 వ్యాప్తి నడుమ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులు సామాన్యులకు ఎంతో మేలు చేయడంతో, నేడు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రభుత్వ సంస్థలే లేకపోతే ఇలాంటి సంక్షోభ సమయంలో పూర్తిగా ప్రైవేటు రంగంపై ఆధార పడగలమా?

పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాలు..

పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాల్లో నాలుగు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వీటిలో మొదటిది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి విక్రయించడం. రెండోది ఆర్థికేతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సంఘటితం చేయడం. మూడోది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటాలను విక్రయించడం. నాలుగోది ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తక్కువ ఉండే సంస్థల్లో వాటాలను క్రమంగా తగ్గించుకోవడం. 

దేశంలో 300కిపైగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ”వ్యాపారం చేయడం ప్రభుత్వం పనికాదు, అందుకే వీటిని ప్రభుత్వం విక్రయించాలి”అని కొందరు నిపుణులు కూడా అంటున్నారు.

మరోవైపు ఈ కంపెనీల సంఖ్యను రెండు డజన్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలీకమ్యూనికేషన్లు, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్, బీమా, ఇతర ఆర్థిక సేవల సంస్థలను వ్యూహాత్మక రంగాలుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగాలను మినహాయించి మిగతా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను విక్రయించాలని ప్రణాళికలు రచిస్తోంది.

ప్రైవేటీకరణకు దీనికి తేడా ఏమిటి?

ఈ అంశంపై సీనియర్ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ బీబీసీతో మాట్లాడారు. ”పెట్టుబడుల ఉపసంహరణలో, ప్రభుత్వ రంగ సంస్థలో కొంత భాగాన్ని ప్రభుత్వం విక్రయిస్తుంది. అయితే, ఆ సంస్థపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది. మరోవైపు ప్రైవేటీకరణలో మెజారిటీ వాటాను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుంది. ఫలితంగా సంస్థ నియంత్రణ కూడా ప్రైవేటు చేతుల్లోకి వెళ్తుంది”అని ఆయన వివరించారు.

పెట్టుబడుల ఉపసంహరణలో, ప్రైవేటు సంస్థలకు నియంత్రణను ఇవ్వాలా? వద్దా? అనేది ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, ప్రైవేటీకరణలో సంస్థ నిర్వహణ, నియంత్రణలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు.

కొన్ని ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు ప్రభుత్వం కార్యచరణ ప్రణాళికలను సిద్ధంచేసిందని 2019, నవంబరు 5న డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ తమ వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది.

ఇప్పటికే పబ్లిక్ లిస్టింగ్ అయిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ”ఆఫర్ ఫర్ సేల్”ను తీసుకురావడం లేదా కొత్తగా షేర్లను జారీ చేయడం ద్వారా పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించాలని భావిస్తోంది.

ఇప్పుడు ఎందుకు?

పెట్టుబడుల ఉపసంహరణకు కొన్ని కారణాలున్నాయి. నష్టాల బాటలో నడుస్తున్న సంస్థలను వదిలించుకోవడం, ఆర్థిక లోటును పూడ్చుకోవడం వీటిలో ప్రధానమైనవి.

మరోవైపు ప్రభుత్వ సంస్థల్లోని వాటాలను విక్రయించడంతో వచ్చిన నిధులతో సామాన్య పౌరులకు వసతులను కల్పించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధులనూ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది.

ఆర్థిక లోటును పూడ్చుకోవడంలో పెట్టుబడుల ఉపసంహరణ కీలకంగా మారుతుంది. మరోవైపు ప్రభుత్వ అప్పులను తీర్చుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.

ఆర్థిక సంస్కరణలతో తొలి అడుగులు..

1991-92లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పుడే.. పెట్టుబడుల ఉపసంహరణకు కూడా మార్గం సుగమమైంది. అప్పట్లో 31 ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులను కేంద్ర ఉపసంహరించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.3,038 కోట్లు వచ్చి చేరాయి.

1996లో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ (డిస్ ఇన్వెస్టిమెంట్ కమిషన్)ను కూడా ఏర్పాటుచేశారు. దీనికి జీవీ రామకృష్ణ నేతృత్వం వహించారు. దశల వారీగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించే బాధ్యతను ఈ కమిషన్‌కు అప్పగించారు.

అప్పట్లో 57 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది. అయితే, 2004లో ప్రభుత్వం మారడంతో ఈ కమిషన్‌ను రద్దు చేశారు.

వాజ్‌పేయీ హయాంలో వేగంగా..

1999లో ఓ ప్రత్యేక విభాగంగా ”డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిస్ ఇన్వెస్ట్‌మెంట్”ను ఏర్పాటుచేశారు. 2001లో దీనికి డిన్ ఇన్వెస్టిమెంట్ మంత్రిత్వ శాఖగా నామకరణం చేశారు. మే 2004 నుంచి దీన్ని ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. 

1991-92 నుంచి 2000-01 వరకు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.54,300 కోట్లను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, వాస్తవానికి దీనిలో సగం అంటే, రూ.20,078 కోట్లను మాత్రమే ప్రభుత్వం సమీకరించగలిగింది. 

ఆ పదేళ్లలో కేవలం మూడు సంవత్సరాల్లో మాత్రమే వార్షిక పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ప్రభుత్వం చేరుకోగలిగింది.

లక్ష్యాలు అందుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మార్కెట్‌లో అనుకూల పరిస్థితులు లేకపోవడం, ప్రభుత్వం చెప్పే ధర ప్రైవేటు సంస్థలను ఆకర్షించేలా లేకపోవడం, ప్రజలు, ఉద్యోగులు, ఉద్యోగ సంస్థల నుంచి ఎదురైన గట్టి వ్యతిరేకత, సరైన పెట్టుబడుల ఉపసంహరణ విధానం లేకపోవడం, రాజకీయ సంకల్పంతోపాటు పారదర్శకత కొరవడటం.. ఇలా చాలా కారణాలను చెప్పుకోవచ్చు.

ప్రభుత్వ రంగ సంస్థల్లో స్వల్ప వాటాలను విక్రయించడం ద్వారా ఈ కాలంలో కొంతవరకు పెట్టుబడులను ఉపసంహరించగలిగారు.

అయితే, 2001 నుంచి 2004 మధ్య పెట్టుబడుల ఉపసంహరణ పుంజుకుంది. ఈ సమయంలో రూ.38,500 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే రూ.21,163 కోట్లను ప్రభుత్వం సమీకరించగలిగింది. ఇదివరకటితో పోలిస్తే.. ఇది కాస్త మేలే.

ఆ తర్వాత ఐదేళ్లలో మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణ నెమ్మదించింది. కేవలం రూ.8,515.93 కోట్లను మాత్రమే ప్రభుత్వం సమీకరించగలిగింది.

2009-11 మధ్య మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణ పుంజుకుంది. ఆ తర్వాత మళ్లీ నెమ్మదించింది. 2011-12లో రూ.40,000 కోట్లను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కేవలం రూ.14,000 కోట్లనే సమీకరించగలిగింది.

అయితే, ఆ తర్వాత కాలంలో, పెట్టుబడుల ఉపసంహరణ నుంచి వస్తున్న నిధులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. కొన్నిసార్లు లక్ష్యాల కంటే ఎక్కువగానే ప్రభుత్వం నిధులను సమీకరించగలిగింది.

అభ్యంతరాలు.. వివాదాలు..

పెట్టుబడుల ఉపసంహరణకు అనుకూల, వ్యతిరేక వర్గాలపై ఎప్పటినుంచో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. భారత్ లాంటి పేద దేశంలో పేదలకు సాయం చేయడానికి ప్రభుత్వ సంస్థలు ఉండాల్సిందేనని కొందరు చెబుతుంటే.. వ్యాపారాలు చేయడం కంటే పాలనపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడితే మేలని మరికొందరు అంటున్నారు.

అయితే, భారత్‌ లాంటి పేద దేశంలో ప్రభుత్వ సంస్థల అవసరం చాలా ఉంటుందని ప్రొఫెసర్ అనిల్ కుమార్ చెబుతున్నారు. ”ఒకవేళ ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు సంస్థల జోక్యం పెరిగితే కొత్త సమస్యలు వచ్చిపడతాయి. దీనికి టెలికాం సెక్టార్ సంక్షోభమే చక్కటి ఉదాహరణ”. 

ఎల్‌ఐసీ లాభాల బాటలో నడుస్తోంది. దీని నుంచి ప్రభుత్వం చాలా లబ్ధి పొందింది. తమకు నిధులు అవసరమైనప్పుడల్లా ఎల్ఐసీ ప్రభుత్వాన్ని ఆదుకుంటూనే వచ్చింది.

”ఎల్‌ఐసీ సామాజిక లక్ష్యాల కోసం ఏర్పాటుచేశారు. తక్కువ ధరకే ఇది ప్రజలకు బీమా పాలసీలు అందిస్తోంది. ప్రైవేటు కంపెనీలు ఇలాంటి విధానాలను అనుసరించవు”అని అరుణ్ కుమార్ చెప్పారు. 

మరోవైపు కంపెనీలను నడపడం ప్రభుత్వ పనికాదని ప్రైవేటు సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఎయిమ్స్, మదర్‌డెయిరీ లాంటి సంస్థలు ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. వీటి వల్ల ప్రైవేటు సంస్థలకు లాభాలు ఆర్జించడం కొంత కష్టం అవుతున్న మాట వాస్తవమే. అయితే, ఈ కంపెనీలను ఎత్తివేస్తే, సాధారణ ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

”కరోనా సంక్షోభ సమయంలో సాధారణ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు సాయం చేయగలిగాయి. అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను దోపిడీ చేశాయనే వార్తలు కూడా వచ్చాయి. ప్రభుత్వ సంస్థల ప్రాముఖ్యత ఏమిటో ఈ కరోనా మహమ్మారి మన కళ్లకు కట్టింది. అయినప్పటికీ మనం చాలా ముఖ్యమైన సంస్థలను విక్రయానికి పెడుతున్నాం”అని అరుణ్ కుమార్ అన్నారు.

2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పెట్టుబడుల ఉపసంహరణపై ఎలాంటి విధానాలను అనుసరిస్తోంది.

నిజానికి 1991నాటి సంస్కరణలతోనే భారత్‌లో పెట్టుబడుల ఉపసంహరణ మొదలైంది. ప్రభుత్వాలు మారినా, ఇదే విధానాలను కొనసాగిస్తున్నారు.

2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, మునుపటిలానే ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై తమ దృష్టిని కొనసాగించింది.

”నిజమే 1980ల తరహాలోనే ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు పనిచేయడంలేదు. అందుకే ఇలాంటి కంపెనీలను ప్రభుత్వం నడపకూడదని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు చక్కగా పనిచేయాలని ప్రైవేటు రంగం ఎప్పుడూ ఆశించదు”అని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

లక్ష్యాలు ఇలా..

2021-22లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

2020-21కు కూడా రూ.2.1 లక్షల కోట్లుగా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే, కోవిడ్-19 ప్రభావంతో కేవలం రూ.19,499 కోట్లను మాత్రమే ప్రభుత్వం సమీకరించగలిగింది.

2014-15లోనూ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.58,425 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. కానీ, రూ.26,068 కోట్లను మాత్రమే ప్రభుత్వం సమీకరించింది.

ఆ తర్వాత ఏడాది 2015-16లో కూడా రూ.69,500 కోట్ల రూపాయలను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని ప్రభుత్వం భావించింది. కానీ, ఖజానాకు చేరింది రూ.23,997 కోట్లు మాత్రమే. 

2016-17లో రూ.56,500 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, రూ.46,247 కోట్లను సమీకరించగలిగారు.

2017-18లో రూ.లక్ష కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అయితే, రూ.1.56 లక్షల కోట్లను ప్రభుత్వం సమీకరించింది.

2018-19లోనూ రూ.80,000 కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, రూ.85,000 కోట్లను ప్రభుత్వం సమీకరించగలిగింది.