దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురు, ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల తెలంగాణ రాజ‌కీయాల్లో అడుగుపెట్టేందుకు ఏర్పాట్లు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. వ‌రుస‌గా ఆమె జిల్లాల వారీగా వైఎస్సార్ అభిమానుల‌తో స‌మావేశాలు జ‌రుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ నేప‌థ్యంలో ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డ‌టంతో ఖ‌మ్మం నేత‌లే ఇవాళ లోట‌స్‌పాండ్‌కి వ‌చ్చి ష‌ర్మిల‌తో భేటీ అయ్యారు.

హైద‌రాబాద్‌, రంగారెడ్డి నేత‌ల‌తో ఆమె స‌మావేశం జరిపారు. కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, న‌ల్గొండ‌కు చెందిన మాజీ డీసీసీబీ అధ్య‌క్షుడు తూడి దేవేంద‌ర్ రెడ్డి ఇవాళ ష‌ర్మిల‌తో భేటీ అవ‌డం కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపింది. వీరిద్ద‌రూ వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యించుకున్నారు. ప‌లువురు ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థులు సైతం ష‌ర్మిల‌ను క‌లిశారు.

కాగా, పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న ష‌ర్మిల రెండు తేదీల‌ను ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. మే 14 లేదీ జులై 8న ఆమె పార్టీని ప్ర‌క‌టించాల‌ని అనుకుంటున్నారు. మే 14న వైఎస్సార్ మొద‌టిసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజు. ఈ నేప‌థ్యంలో ఇదే రోజు ష‌ర్మిల పార్టీని, జెండా, అజెండాను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.