కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరి ప‌రిధిలోని యానాం నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ప‌ని చేస్తూ యానాంలో ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న మ‌ల్లాడి కృష్ణారావు త‌న రాజ‌కీయ జీవితానికి గుడ్‌బై చెప్పారు. ప్ర‌స్తుతం పుదుచ్చేరి ప్ర‌భుత్వంలో ఆయ‌న ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.

సుదీర్ఘ‌కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌ని చేసిన మ‌ల్లాడి ఇక రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఇటీవ‌ల పుదుచ్చేరి ప్ర‌భుత్వం ఉత్త‌మ శాస‌న‌స‌భ్యుడి అవార్డును అందించింది. మ‌ల్లాడి రాజ‌కీయ ర‌జ‌తోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని కూడా అక్క‌డి ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించి ఆయ‌న‌ను గౌర‌వించింది.

ఆ త‌ర్వాత జ‌న‌వ‌రి 7న మ‌ల్లాడి కృష్ణారావు త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇవాళ ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేసేశారు. మ‌ల్లాడి కృష్ణారావు మొద‌టిసారి 1996లో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అప్ప‌టినుంచి వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు. అయితే, పుదుచ్చేరి రాజ‌కీయాల‌కు దూర‌మైనా ఏపీ రాజ‌కీయాల్లో మ‌ల్లాడి కీల‌క పాత్ర పోషించ‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.