ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది.

గతంలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియ మరల అక్కడ నుండే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది.కోవిద్-19 లొక్డౌన్ వల్ల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన వరకూ వచ్చిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ గత ఏడాది మార్చి15న ఆగిపోయింది.తదుపరి ఆదేశాల వరకూ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది మే 6న ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయితీల్లో అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ దశ నుంచి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు నేడు అనగా ఫిబ్రవరి 15, 2021 నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న ఎస్ఈసీ, ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన పురపాలక ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగేలా నిర్ణయం తీసుకుంది.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

  • అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణకు ప్రారంభ తేదీ-02.03.2021 (మంగళవారం)
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- 03.03.2021 (బుధవారం మధ్యాహ్నం 3 లోపు)
  • పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రచురణ తేదీ-03.03.2021 (బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత)
  • ఎన్నికల తేదీ-10.03.2021 (బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు)
  • ఎక్కడైనా రీపోలింగ్ జరపాల్సి వస్తే, పోలింగ్ తేదీ-13.03.2021 (శనివారం)
  • కౌంటింగ్ తేదీ – 14.03.2021 (ఆదివారం ఉదయం 8 నుంచి)

పురపాలక ఎన్నికల షెడ్యూల్‌తో రాష్ట్రంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.ఇది రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అమలులో ఉంటుంది.