భారతదేశంలో రైతుల నిరసనలకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన ‘టూల్‌కిట్’ మీద నమోదైన కేసుకు సంబంధించి బెంగళూరుకు చెందిన విద్యార్థిని ఇంకా పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.దిల్లీలోని ఒక కోర్టు 22 ఏళ్ల పర్యావరణ కార్యకర్త దిశా రవిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. బెంగళూరులోని సీనియర్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషీ వివరాల ప్రకారం శనివారం సాయంత్రం దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ టూల్‌కిట్ కేసులో బెంగళూరులో దిశను అరెస్ట్ చేసింది.

ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన దిశా రవి వయసు 22 సంవత్సరాలు. ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేటు కాలేజీలో బీబీఏ డిగ్రీ చేస్తున్నారు.

“టూల్‌కిట్ కేసులో విచారించడానికి దిశను అదుపులోకి తీసుకున్నారు” అని బెంగళూరులోని ఒక పోలీసు అధికారి పేరు వెల్లడించకూడదనే షరతుపై మీడియా కి వెల్లడించారు.”టూల్‌కిట్ ఎడిట్ చేస్తున్న వారిలో దిశ కూడా ఉన్నారు” అని ఆదివారం దిల్లీ పోలీస్ ఏపీఆర్ఓ అనిల్ మిత్తల్ ఒక ప్రకటనలో చెప్పారు.దిశను ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నామని దిల్లీ పోలీసులు చెప్పారు. ఆ సమయంలో ఆమెను విచారించనున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ కూడా సీజ్ చేశారు.

దిశ లాయర్ లేని సమయంలో ఆమెను పోలీసు కస్టడీకి పంపించండం గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.సుప్రీంకోర్టు లాయర్ రెబెకా జాన్ ఈ అంశంపై ఫేస్‌బుక్‌లో “ఈరోజు పటియాలా కోర్టు డ్యూటీ మేజిస్ట్రేట్ ప్రవర్తన నన్ను నిరాశకు గురిచేసింది. ఆయన మహిళకు ప్రాతినిధ్యం వహించే లాయర్ కోర్టులో ఉన్నాడా లేదా అనేది తెలుసుకోకుండానే ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపించాలని ఆదేశించారు” అని, “జడ్జిలు తమ కర్తవ్యాన్ని సీరియస్‌గా నిర్వర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22ను పూర్తిగా అనుసరించేలా చూడాలి. విచారణ సమయంలో మహిళ తరఫు వాదించడానికి లాయర్ ఎవరూ లేకపోతే ఆమె లాయర్ వచ్చేవరకూ మేజిస్ట్రేట్ వేచిచూడాలి. లేదంటే, ఆమెకు న్యాయ సహాయం అందించాలి. కేస్ డైరీ, అరెస్ట్ మెమోను చూశారా” అని అన్నారు. బెంగళూరు కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ లేకుండానే మహిళను దిల్లీ కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టారని మేజిస్ట్రేట్ దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ను అడిగారా అని కూడా ఆమె ప్రశ్నించారు.

రెబెకా జాన్ పోస్టును ట్విటర్‌లో చాలామంది చట్ట నిపుణులు షేర్ చేస్తున్నారు. ఈ అంశం గురించి ప్రశ్నిస్తున్నారు.జడ్జి ఆమెను కస్టడీకి పంపించాల్సిన అవసరమే లేదని, దర్యాప్తుకు ఆమె పూర్తి సహకారం ఉంటుందని సుప్రీంకోర్ట్ లాయర్ దుష్యంత్ ఆరోరా అన్నారు .దిశా రవి అరెస్ట్‌లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి సీనియర్ లాయర్ రెబెకా జాన్ రాశారు” అని దానిని షేర్ చేసిన లాయర్ వినయ్ శ్రీనివాస్ అన్నారు.

చిన్న వాటికే జనాలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని సీనియర్ లాయర్ సౌరభ్ కృపాల్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.”ఆమె దోషి అయితే, విచారణ జరిపి శిక్షించండి. శిక్షకు ప్రత్యామ్నాయంగా ప్రీ-ట్రయల్ అరెస్ట్ అనేది పోలీసులు తమ బాధ్యతల నుంచి కాపాడుకోవడానికి సంకేతం. ఒక పౌరుడిగా నాకు ఇది ఆందోళన కలిగించే విషయం” అని ఆయన పేర్కొన్నారు.
రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ కూడా దిశ అరెస్ట్‌ దారుణమని వ్యాఖ్యానించారు. “ఇది అనవసరంగా వేధించడం మరియు భయపెట్టడం, దిశా రవికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

దిల్లీ పోలీసులు తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో “దిశా రవిని దిల్లీ పోలీస్ సైబర్ టీమ్ అరెస్ట్ చేసింది. ఆ టూల్ కిట్‌కు ఆమె ఎడిటర్. డాక్యుమెంట్‌ను తయారు చేసి, దానిని సోషల్ మీడియాలో సర్కులేట్ చేసిన ప్రధాన కుట్రదారు” అని ట్వీట్ చేశారు.

“ఆమె (దిశా రవి) ఈ టూల్ కిట్ రూపొందించడానికి పని చేసే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ టూల్ కిట్ పైనల్ డ్రాఫ్ట్ తయారు చేసిన టీమ్‌తో కలిసి పనిచేశారు” అని కూడా దిల్లీ పోలీసులు చెప్పారు.దీనితోపాటూ దిల్లీ పోలీసులు తమ ట్విటర్‌లో “ఈ ప్రక్రియలో దిశా, ఆమె సహచరులు భారత్‌కు వ్యతిరేకంగా విద్వేషాలు వ్యాపించేలా ఖలిస్తాన్ అనుకూల ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ అనే సంస్థతో కలిసి పనిచేశారు. ఆ టూల్ కిట్ డాక్యుమెంట్‌ను గ్రెటా థన్‌బర్గ్‌తో షేర్ చేసుకుంది దిశానే. తర్వాత దానిని సోషల్ మీడియా నుంచి తొలగించాలని గ్రెటాకు చెప్పింది కూడా దిశానే. దానిలోని కొన్ని రెచ్చగొట్టే భాగాలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి” అని రాశారు.

ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న టూల్‌కిట్ డాక్యుమెంట్ గురించి తెలిసిన తర్వాత తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఫిబ్రవరి 4న దిల్లీ పోలీసులు సమాచారం ఇచ్చారు.

జనవరి 26న జరిగిన అల్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగాయని, అందులో ఈ డాక్యుమెంట్ పాత్ర ఉందని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.

వారి వివరాల ప్రకారం భారత్‌కు వ్యతిరేకంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ యుద్ధం రెచ్చగొట్టడానికి ఈ టూల్ కిట్ పిలుపునిచ్చింది.ఈ టూల్‌కిట్ మీద పనిచేసిన వారి వివరాలు సేకరించడానిక గూగుల్‌ను సంప్రదిస్తామని కొన్ని రోజుల క్రితం దిల్లీ పోలీసులు చెప్పారు.

మొదట్లో దిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో గ్రెటా థన్‌బర్క్ పేరు కూడా చేర్చారనే వదంతులు వచ్చాయి. కానీ తర్వాత పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో ఎవరి పేరూ లేదని, దానిని అనామకులపై నమోదు చేశామని చెప్పారు.

‘కలెక్షన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్ ఇన్ ఇండియా’ అనే సంస్థ దిశ అరెస్టు తర్వాత ఒక ప్రకటన జారీ చేసింది.”కేంద్ర ప్రభుత్వం యువతను, పర్యావరణ కార్యకర్తలను టార్గెట్ చేసుకోవడం ఆపాలి. దేశంలో పర్యావరణ, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి” అని అందులో చెప్పింది.దిశా రవి అరెస్ట్ సమర్థనీయం కాదు. దిల్లీ పోలీసులు నియమాలను పాటించడంలేదనేది దాచాల్సిన విషయమేం కాదు. కానీ దిశ అరెస్ట్ ఖండించదగినది. ఇది రాజ్యాంగ సిద్ధాంతాలను ధిక్కరించడమే” అన్నారు.”భారత ప్రభుత్వం ఇలాంటి చర్యలు, ప్రజాస్వామ్యం గొంతు నులమడంతో సమానం” అని కూడా అది తన ప్రకటనలో చెప్పింది.