ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం నిలిచి కలకలం సృష్టించిన సంగతి పాఠకులకు విదితమే!
అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం (స్కార్పియో) కేసుకు సంబంధించి ఓ తెలుపు రంగు ఇన్నోవా కారును ఎన్ఐఏ ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలున్న వాహనాన్ని అనుసరించిన కారు ఇదేనా? కాదా అన్నది ఇంకా విచారించాల్సి ఉంది.
ఇక ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. అయితే ఘటన జరిగిన సమయంలో వాజే అక్కడే ఉన్నారా అని పరిశీలించడానికి ముంబయి పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించగా, పీపీఈ కిట్ ధరించిన ఓ వ్యక్తి స్కార్పియోను అక్కడ నిలిపినట్లు గుర్తించారు. అయితే, ఆ పీపీఈ కిట్ వేసుకున్న వ్యక్తి సచిన్ వాజేనేనా? లేదా మరో వ్యక్తా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌లతో పాటు వాజే వివరణకు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. వాజేను గత శనివారం రాత్రి ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఆదివారం కోర్టులో హాజరుపర్చగా, ఈనెల 25 వరకు కస్టడీ విధించింది.
రాజ్యసభ సభ్యుడు ఆదివారం సంజయ్ రౌత్ పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తును చేపట్టడం ద్వారా ఎన్ఐఏ ముంబయి పోలీసుల ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని, మహారాష్ట్రలో అస్థిరతను సృష్టిస్తోందని ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ ఎన్ఐఏ అరెస్టు చేసిన సచిన్ వాజే ‘నిజాయతీపరుడు, విజయవంతమైన, పరిశోధనలో మేటి అయిన అధికారి’ అని రౌత్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను పణంగా పెట్టారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన హిరేన్ మన్సుఖ్ కేసును ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్), ఎన్ఐఏలు దర్యాప్తు చేస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ కేసులను ముంబయి పోలీసులు దర్యాప్తు చేయగలరని, వీటికి కేంద్రం సహాయం అవసరం లేదని రౌత్ అన్నారు. వాజేను ఎన్ఐఏ అరెస్టు చేయడం పోలీసుల హక్కులను లాగేసుకోవడం, వారి సామర్థ్యాలపై దాడి చేయడమే అవుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సున్నితమైన సమాచారం ప్రతిపక్ష నేతలకు చేరడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని రౌత్ పేర్కొన్నారు. ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది.