ఎన్నికలు (Elections) వార్తలు (News)

ఏపీలో పార్టీల ఫలితాలు జిల్లాల వారీగా…

మరొకసారి వైకాపా ఎన్నికల్లో తన హవా చూపించింది. అధికార పార్టీకి సహజంగా ఉండే సానుకూలతలు సునాయాస విజయాన్ని సాధించి పెట్టాయి. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల గెలుపు బాధ్యతను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ మంత్రులు, ఎమ్మెల్యేల భుజస్కంధాలపై ఉంచారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ గెలుపునకు కీలకమయ్యాయన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. పార్టీ అభ్యర్థుల్ని కచ్చితంగా గెలిపించి తీరాలన్న బలమైన సంకేతాలు ఉండటంతో వారు సర్వశక్తులూ ఒడ్డి మరీ పోరాడాడు. కొన్ని రోజులుగా సొంత జిల్లాల్లో, నియోజకవర్గాల్లో మకాం వేసి ఎన్నికల వ్యూహాలను అమలు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

జనసేన పార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి కొన్ని ప్రాంతాల్లో గెలుపు అందుకుంది. భాజపాతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. రాష్ట్రంలో తమ పార్టీ 320 వార్డుల్లో చేయగా, 18 వార్డుల్లో విజయం సాధించింది. 10 మున్సిపాలిటీల్లో బోణీ కొట్టింది. అమలాపురంలో 6 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో 4 వార్డులు గెలుచుకుంది. మొత్తంగా నగరాల్లో జనసేన 224 డివిజన్లలో పోటీ చేసి 7 చోట్ల గెలుపొందింది. విశాఖపట్నం కార్పొరేషన్‌లో 3 డివిజన్లను గెలుచుకుంది. గుంటూరులో 2 చోట్ల, ఒంగోలు, మచిలీపట్నంలో ఒక్కో డివిజన్‌లో విజయం సాధించింది.

పుర ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులు 3 వార్డులు, 3 డివిజన్లలో విజయం సాధించారు. సీపీఐ 3 వార్డులు, ఒక డివిజన్‌లో గెలుపు సొంతం చేసుకోగా, సీపీఎం అభ్యర్ధులు రెండు డివిజన్లలో గెలుపొందారు. విశాఖపట్నంలో సీపీఐ, సీపీఎంలు ఒక్కో డివిజన్‌ను చేజిక్కించుకొనగా, విజయవాడలో సీపీఎం ఒక స్థానంలో గెలుపొందింది. రాయలసీమలోని గుంతకల్‌, తాడిపత్రి, డోన్‌లలో ఒక్కో వార్డులో సీపీఐ విజయం సాధించింది.

తెదేపా ఈసారి పురపాలక ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. 2019 ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిన చోటు కూడా ఈసారి పరాజయం పొందింది. అణచివేత, పోలీసు నిర్బంధాలూ దీనికి ప్రధాన కారణమని పార్టీశ్రేణులు చెబుతున్నాయి. ప్రత్యర్థులు ఎక్కడ గేలం వేస్తారోనన్న భయంతో కొన్నిచోట్ల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేవరకూ అభ్యర్థుల్ని దాచిపెట్టాల్సి రావడం నాయకుల స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఉద్దేశంతో అధినేత చంద్రబాబు కర్నూలు, విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో ప్రచారం చేశారు. అధికార పార్టీ ధనబలం, అంగబలం, పోలీసు అండతో అడుగడుగునా ఎన్నికలను, ఓటర్లను ప్రభావితం చేసిందని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమని తెదేపా నాయకులంటున్నారు. 3 రాజధానులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి అంశాలపై ప్రజా వ్యతిరేకత తమకు విజయవాడ, గుంటూరు, విశాఖల్లో కలసి వస్తుందనుకున్న పార్టీ నాయకత్వం నమ్మకం వమ్మయింది. పార్టీకి బలమైన పునాదులు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నా, వారిని ముందుండి నడిపించాల్సిన స్థానిక నాయకత్వం చాలాచోట్ల కాడి పడేయడం కూడా ప్రతికూలంగా మారింది. ఒత్తిళ్లున్నా నియోజకవర్గ స్థాయిలో నాయకులు గట్టిగా నిలబడితే మెరుగైన ఫలితాలు సాధించగలం అనడానికి తాడిపత్రి, మైదుకూరుల్లోను, కొంతవరకూ నర్సీపట్నం, బొబ్బిలి వంటిచోట్ల వచ్చిన ఫలితాలే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 7 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన భాజపా పట్టున్న చోట అభ్యర్థులను నిలిపింది. ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసిందీ అధికారికంగా ప్రకటించలేదు కానీ కొవ్వూరు, హిందూపురం, గూడూరు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో రెండేసి చోట్ల కమలం వికసించింది. కార్పొరేషన్లలో మాత్రం విశాఖపట్నంలోనే ఒక డివిజన్‌లో గెలుచుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.