గవర్నర్‌ ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభం కాగా, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఉండవని, విద్యుత్‌రంగం దెబ్బతింటుందని, పరిశ్రమలు రావని, అభివృద్ధి కుంటుపడుతుందని కొందరు దుష్ప్రచారం చేశారు కానీ అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి పని చేస్తూ మిగతా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడిందని అన్నారు. పలు వినూత్న పథకాలతో ప్రభుత్వం విమర్శకులను ఆశ్చర్యచకితులను చేసిందని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోనే అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు దీటుగా దూసుకుపోతోందని, దూరదృష్టితో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రి వర్గం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశాయని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. పైగా ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో చీకటి ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందరూ కలిసికట్టుగా శ్రమించి అభివృద్ధికి బాటలు పరుచుకున్నామని, అయితే ఇది రాత్రికి రాత్రే సాధించిన విజయం కాదని గవర్నర్‌ అన్నారు.

ఆర్ధిక రంగంలో క్రమశిక్షణలో తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచిందని, 2020-21 ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,27,145గా ఉంటుందని అంచనా వేసినట్లు, ఇది 2013-14 ఆర్ధిక సంవత్సరం నాటికి రూ. 1 లక్షకుపైగా మాత్రమే ఉండేదని ఆమె అన్నారు.

2019-20నాటికి ఆర్ధిక మాంద్యం, 2020-2021కి కరోనా వైరస్‌ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపినా, దానిని తట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించి అమలు జరిపిందని, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ తీవ్రంగా శ్రమించారని ఆమె అన్నారు. అన్నివర్గాల వారికి కరోనా చికిత్సను ఉచితంగా అందించి ప్రభుత్వం ఎన్నో ప్రాణాలను నిలబెట్టిందని చెప్పారు.

మిషన్‌ భగీరథ పథకం మంచి నీటి సమస్యను తీర్చి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, మారుమూల తండాలకు సైతం తాగునీరు ఇవ్వడం ద్వారా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందామని, తెలంగాణను ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని గవర్నర్‌ వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో మంచి నీటి వ్యవస్థ కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేదని ఆమె తెలిపారు.

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఐటీ రంగంలోనే 250కి పైగా కొత్త కంపెనీల, 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని గవర్నర్‌ వెల్లడించారు.సులభతర వాణిజ్య విధానంలో దేశంలోని టాప్-3 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని, 15వేలకు పైగా పరిశ్రమలు, 15 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించామని గవర్నర్‌ తెలిపారు.