ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తులు అక్రమ మార్గాలు పట్టి మోసాలు చేయడంలో రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నారు. కొత్త ఎత్తులు వేసి తమ వ్యాపారాన్ని సాగించేస్తున్నారు. సాధారణ పంటల మధ్య డ్రగ్స్‌కు అవసరమైన రా మెటీరియల్ సాగు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి భారీ మాఫియా గుట్టును మదనపల్లె పోలీసులు రట్టు చేశారు.

ఈ కేసు చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగు చూసింది. కొందరు రైతులను వక్రమార్గం పట్టించి కూలీలతో డ్రగ్స్‌కు అవసరమైన పంట పండిస్తున్నారు. మదనల్లెలో టమాటో పంట సాగు పేరుతో కొందరు వ్యక్తులు, ఓపీఎంను పండిస్తున్నారు. దీన్ని మార్ఫిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్‌ కోసం ఉపయోగిస్తారు. పరిసరాలు చూస్తే టమాటో పంట సాగు కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్లి చూస్తే మత్తు పదార్థాలకు అవసరమైన రా మెటీరియల్ పండిస్తున్న తెలుస్తుంది. ఈ డ్రగ్‌ మాఫియాను పోలీసులు ఛేదించి ఇద్దర్ని అరెస్టు చేశారు. కీలక వ్యక్తుల కోసం వేట సాగిస్తున్నారు. ఎన్నో రోజులుగా ఈ దందా సాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఎస్‌ఈబీ అధికారులు మెరుపుదాడి చేసి, ఓపీఎం కాయలు ధ్వంసం చేశారు. కానీ అసలు వ్యక్తులు ఎవరు పట్టుబడలేదు. ఎస్‌ఈబీ అధికారులు వెళ్లేసరికి ఇద్దరు కూలీలు మాత్రమే అక్కడ ఉన్నారు. వాళ్లను అరెస్టు చేసిన ఆఫీసర్స్‌ పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. కూలీలతో ఈ తప్పుడు పనులు చేయించి, వేరే వ్యక్యులు లాభపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈ ఓపిఎంకు బయట దేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో డ్రగ్ మాఫియా గుర్తు పట్టలేని ఇలాంటి ప్రాంతాల్లో పండించి సొమ్ము చేసుకుంటోంది. దీనికోసం అమాయక రైతులను బలి చేస్తుంది. ఇంకా ఏఏ ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేస్తున్నారనే కోణంలోనూ అధికారులు కూపీ లాగుతున్నారు. డబ్బులకు ఆశపడి రైతులు ఇలాంటి తప్పుడు దారిలో వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్‌లో అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎక్కడైనా చూస్తే తమకు సమాచారం అందివ్వాలని కోరుతున్నారు. అనుమానితులు కనిపిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.