తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన అందర్నీ ఆందోళనకు గురిచేసింది. జిల్లాలోని ఇరక్‌పల్లికి చెందిన వ్యక్తి మూడు రోజుల క్రితం మండల కేంద్రం మనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణవడంతో అక్కడి వైద్యుడు మురళీకృష్ణ మందులు ఇచ్చి, ఇంట్లో క్వారంటెయిన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని నాగల్‌గిద్దలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వైద్యుడు పర్యవేక్షిస్తున్న సమయంలో కొవిడ్‌ రోగి రక్తదానం చేస్తుండగా గుర్తించి అవాక్కై ‘ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాల్సిన నువ్వు రక్తదానం చేయడమేంటని’ నిలదీయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో సేకరించిన 15 యూనిట్ల రక్తాన్ని నిర్వాహకులు బయటపడేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.