గతంలో కరోనా ఒక వ్యక్తికి సోకితే అతని వరకే పరిమితం అయ్యేదని, కానీ ప్రస్తుత వైరస్‌ తీవ్రత కారణంగా ఇంట్లో ఒకరికి సోకితే గంటల్లోనే కుటుంబసభ్యులకు అంటుకొనే ప్రమాదం ఉన్నదని, అవరమైతే ఇంట్లోనూ మాస్క్‌ ధరించాలని డాక్టర్‌ గడల శ్రీనివాసరావు సూచించారు. తాజా పరిణామాలను బట్టి వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని, ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందేనని,నాలుగైదు వారాలుగా రాష్ట్రంలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇదే పరిస్థితి దాదాపు 6 వారాలపాటు కొనసాగే అవకాశం ఉన్నదని స్పష్టంచేశారు.

నిర్లక్ష్యంచేస్తే రాష్ట్రం మహారాష్ట్రను మించిపోయే ప్రమాదం ఉన్నదని, ప్రజల జీవనోపాధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినకూడదని ప్రభుత్వం లాక్‌డౌన్‌, కర్ఫ్యూ విధించట్లేదని, పరిస్థితులను అర్థంచేసుకొని ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.