కరోనా ఉద్ధృతి దృష్ట్యా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయగా ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఎస్‌ఎస్‌ఈ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్‌ విధానం ద్వారా పదో తరగతి ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. టెన్త్‌ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేస్తామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఆదేశాలు జారీచేశారు. జూన్‌ రెండో వారంలో సమీక్షించి రెండో సంవత్సర పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని, బ్యాక్‌లాగ్‌ ఉన్న రెండో సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్‌ మార్కులు వేస్తామని, ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.