అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఫీజు చెల్లిస్తే గ్రీన్‌కార్డ్‌ లభించినట్టే..??

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికోసం గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇకపై లేదని, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న వారు కొంత మొత్తం చెల్లించడం ద్వారా గ్రీన్‌కార్డు పొందొచ్చని ఇమ్మిగ్రేషన్‌ పాలసీ అనలిస్ట్‌ వివరించారు. ముఖ్యంగా భారతీయులు పెద్ద సంఖ్యలో దీనివల్ల లబ్ధి పొందనున్నారు. అయితే, దీనికి సంబంధించిన ప్రతిపాదిత బిల్లు చట్టరూపం దాల్చాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ వీసాల్లో ప్రతి దేశానికీ ఏడు శాతం పరిమితి ఉండడంతో హెచ్‌-1బీ పని వీసాలపై వచ్చిన వారు గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువ జనాభా కలిగిన భారత్‌, చైనా వలసదారులు ఈ నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ ప్రతిపాదిత బిల్లు కాపీని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయారిటీ డేట్ దాటి రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగ ఆధారిత వలసదారులు 5000 డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసం పొందొచ్చు. అదే ఈబీ-5 వీసాదారులు అయితే 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ ఆధారిత వలసదారులు గ్రీన్​కార్డు పొందేందుకు 2500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చెల్లించే సాధారణ రుసుముకు అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్రతిపాదిత బిల్లులో గ్రీన్‌ కార్డుల కోసం దేశాల కోటాను ఎత్తివేయడం, హెచ్‌1బీ వీసా వార్షిక కోటాకు సంబంధించిన పరిమితులు ఎత్తివేయడం వంటి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని శాశ్వత నిర్మాణాత్మక మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవు. అలాగే ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే జ్యుడీషియరీ కమిటీ ఆమోదించాలి. ఆ తర్వాత ప్రతినిధుల సభ, సెనేట్‌ ఆమోదం పొందిన అనంతరం అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం దాలుస్తుంది. ఒకవేళ ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే అమెరికాకు చిన్నవయసులో వచ్చినవారు, తాత్కాలికంగా రక్షణ పొందినవారు, వ్యవసాయ కూలీలు, మహమ్మారి కాలంలో అత్యవసర కార్మికులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఓ విధంగా వీసాలపై ఉన్న పరిమితిని ఎత్తివేసినట్లేనని ఇమ్మిగ్రేషన్‌ పాలసీ అనలిస్ట్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్‌, చైనీయులే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •