ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఉలవలు వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా??

నవధాన్యాలలో ఒకటైన ఉలవలలో అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఉలవలను రోజూ తింటే అనేక రకాలైన వ్యాధులను నివారించవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఈ ఉలవలను పేదవారు మాత్రమే గుగ్గిళ్లుగానో లేదా చారుగానో చేసుకుని తినేవారు.

కానీ దీని ప్రాముఖ్యత తెలుసుకోవడంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు తినే ఆహారపదార్ధాల్లో ఉలవలను కూడా చేర్చారు. మన దేశంలో వీటి పేరు తెలియని వారుండరు. అంతేకాదు ఇప్పుడు ఉలవల(horse gram)తో చేసిన వంటకాలు అత్యంత ఖరీదైనవి. ఇప్పుడు విందు వినోదాలలో వాడడం స్టేటస్‌ సింబల్‌ గా భావిస్తున్నారు. అంతేకాదు తెలుగు వారికీ ఇప్పుడు ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు ప్రియమైన వంటకాలుగా మారిపోయాయి.

అసలు ఈ ఉలవల్లో ఏముంటాయంటే..
ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. ఉలవలను చారుగా, ఉడకపెట్టి గుగ్గిళ్ల గా కూడా తీసుకుంటారు. ప్రతి 100 గ్రాముల ఉలవ గుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు బోలెడంత పీచుపదార్థమూ లభిస్తుంది. ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదని ఖశ్చితంగా చెప్పవచ్చు.

ఉలవలు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు :
ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి. దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అకారణంగా కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలున్న వారు ఉలవలతో చేసిన అహారం తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది. ఇంకా ఉలవలు ఆకలిని కూడా పెంచుతాయి. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి మేలు చేస్తాయి. మూత్రంతో మంటతో ఇబ్బంది పడేవారు ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు. కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. నెలసరి రెగ్యులర్ గా రాని మహిళలు ఉలవలను తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన నెలసరి రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు. ఉలవలు దెబ్బతిన్న కాలేయాన్ని కూడా కోలుకునేలా చేస్తాయి. ఉలవల్లో ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఉలవల్లో ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.

కానీ ఈ ఉలవలు ఎక్కువగా తీసుకోవడం వలన వేడి చేసే గుణం ఉంటుంది. కనుక ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా తీసుకుంటే వేడి చేయదు. ఉలవలను నేరుగా తినేదాని కంటే ఉడికించి, మొలకలెత్తించి లేదా వేయించి పొట్టు తీసితిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది. ఇక ఉలవలను కనీసం 8 గంటల పాటు నానబెట్టడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •