ఇండోనేషియా ఫ్లోరస్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఫ్లోరస్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం నిర్ధారణయ్యింది. ఫ్లోరెస్ దీవిలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. అప్రమత్తమైన ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా జియోలాజికల్ సర్వే కూడా దీనిని నిర్ధారించింది. మామెర్ పట్టణానికి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఫ్లోరస్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల అడుగున భూకంపం సంభవించినట్టు తెలిపింది.

భూకంపం సంభవించిన ప్రాంతానికి చుట్టూ 1000 కిలోమీటర్ల పరిధిలో అలలు భయంకరంగా ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం తాజా భూకంపం కారణంగా ప్రాణ నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ప్రాంతంలో ఇటీవల సంభవించిన భూకంపాలు.. సునామీ, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రమాదాలు సంభవించడం కారణంగా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.