శనివారం నిర్వహించిన పదో తరగతి ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రంలో ఒక ప్యాసేజ్‌లో “మహిళా విమోచనం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు దెబ్బతింటున్నాయి”, “భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది” వంటి అంశాలున్నాయి. ఈ ప్రశ్న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. “మహిళలను సీబీఎస్‌ఈ అవమానపరిచింది” అంటూ పలువురు తీవ్రస్థాయిలో మండిపడడంతో వివాదాస్పద ప్రశ్నను తొలగిస్తున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ప్రకటిస్తూ ఈ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తామని స్పష్టంచేసింది.

సీబీఎస్‌ఈ ఈ అంశాన్ని విషయ నిపుణులకు నివేదించి వారి అభిప్రాయాన్ని కోరిన అనంతరం వారి సూచన మేరకు ఈ ప్రశ్నను ఉపసంహరిస్తున్నట్లు సోమవారం తెలిపింది. అదే సమయంలో ప్రశ్నపత్రం రూపకల్పన ప్రక్రియను సమీక్షించి, బలోపేతం చేసేందుకు కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది.