ఏపీలో పెన్షనర్లకు కొత్త ఏడాదిలో వృద్ధాప్య పింఛను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలనెలా ₹2,250ల చొప్పున పింఛను ఇస్తున్న నేపథ్యంలో ఇకపై దాన్ని ₹2,500లకు పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలుచేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నిర్ణయాలను వెల్లడించారు.

ఇక సీఎం డిసెంబర్‌, జనవరిలలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభించనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్టు, ఈ పథకం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూర్చనున్నట్టు తెలిపారు. 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో ₹45వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారని, జనవరిలోనే రైతు భరోసా సాయం ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. రైతు భరోసా సాయం తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.