తెలంగాణ హైదరాబాద్ లో ఉచితంగా 20వేల లీటర్ల తాగునీటిని పొందాలంటే ఆధార్‌ అనుసంధానం చేయాలని నియమం ఉండడంతో ఆధార్ అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈ పథకం కోసం జలమండలిలో ఆధార్‌ -క్యాన్‌ నెంబరును అనుసంధానం చేసి, మీటర్లు బిగించుకోవడానికి తొలుత ఈ ఏడాది మార్చి 31 వరకు, ఆ తర్వాత ఏప్రిల్‌ 30 వరకు, ఆగస్టు15 వరకు గడువు విధించింది. కానీ, జలమండలి డివిజన్‌-2లో ఈ పథకానికి స్పందన అంతంత మాత్రంగానే లభించడంతో
గడువును మరోసారి డిసెంబర్‌ నెలాఖరు వరకు పొడిగించారు.

జలమండలి డివిజన్‌-2 పరిధిలో మొత్తం అధికారికంగా సుమారు 96,923 నీటి కనెక్షన్లు ఉండగా దాదాపు 39,563 కనెక్షన్లు మాత్రమే ఆధార్‌కు అనుసంధానం చేశారు. కేవలం 40 శాతమే ఉచిత నీటి పథకానికి స్పందించారు. 60శాతం మంది వినియోగదారులు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఆధార్‌ అనుసంధానం చేసుకోకున్నా, మీటర్లు బిగించుకోకున్నా ఇకపై వారికి ఉచిత తాగునీటి పథకం వర్తించదు. వీరికి అధికారులు గతేడాది డిసెంబర్‌ నుంచి ఒకేసారి 13 నెలల బకాయి నీటిబిల్లులు జారీ చేయనున్నారు. ఈ విషయంపై ఆస్మాన్‌గఢ్‌, సంతో్‌షనగర్‌, అలియాబాద్‌, బాలాపూర్‌ సబ్‌డివిజన్ల పరిధుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నట్లు జలమండలి జీఎం నాగేంద్రకుమార్‌ వెల్లడించారు.