ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన కోవిడ్ నిబంధనలను పొడిగించింది. కరోనా వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కోవిడ్ ఆంక్షలను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్ షోలు, పాదయాత్రలు, బహిరంగసభలను నిర్వహించకూడదు. ఇంటింటి ప్రచారాన్ని కూడా ఐదుగురికి మించి ఉండకుండా చూసుకోవాలి. గతంతో జనవరి 15 వరకు ఆంక్షలను విధించిన ఈసీ, వాటిపై సమీక్ష జరిపింది.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే కోవిడ్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం జరిగే తీరుపై ఆంక్షలను విధిస్తూ అభ్యర్ధులు, పార్టీలు డిజిటల్ ప్రచారానికే ఎక్కువగా మొగ్గు చూపించాలని ఈసీ కోరింది. ప్రచారంలో కోవిడ్ నిబంధనలను పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. ఈసీ ఆంక్షలతో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రధాన నేతల పర్యటనలు రద్దవగా అభ్యర్ధులు కేవలం ఇంటింటి ప్రచారం మాత్రమే నిర్వహిస్తున్నారు.