పండగ సమయంలో జనం గ్రామాలకు వెళుతుండడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్కూల్స్ రీ ఓపెన్‌పై తెలంగాణ సర్కార్ పునరాలోచనలో పడినట్టు, మరో రెండు వారాలు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తే మంచిదనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రేపటితో పండుగ సెలవులు ముగిసి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది. అయితే మరో 2 వారాలపాటు సెలవులు పొడిగించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా విద్యాశాఖ నివేదిక సమర్పించింది.

నెలాఖరు వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించింది. దీనివల్ల రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తుండగా మరోవైపు ఈ నెల చివరి వరకు కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో నెలాఖరు వరకు విద్యాసంస్థలు మూసివేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే స్కూళ్లకు సర్కార్‌ సెలవులు ప్రకటించగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ వాటిని లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఇష్టారాజ్యంగా స్కూల్స్, కాలేజీలు నడిపేస్తున్నాయి. సంక్రాంతి సెలవులు ఉన్నప్పటికీ, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్లాసులు నడుపుతున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.