భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్తూ సంచలన ప్రకటన చేసాడు. దీంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగినట్లు అయింది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీని వన్డే నాయకత్వం నుంచి బీసీసీఐ తొలగించి విరాట్ స్థానంలో రోహిత్‌శర్మను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా కెప్టెన్సీకి వీడ్కోలు చెబుతూ విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు.

‘‘గత ఏడేళ్లుగా సారథిగా జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశా. బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించా. ప్రతి దానికి ముగింపు అనేది ఉంటుంది. అది నా టెస్టు కెప్టెన్సీకి కూడానూ. ఇప్పటి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను అనుభవించా. అయితే కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు. విజయం కోసం 120 శాతం కృషి చేశానని బలంగా నమ్ముతున్నా. జట్టు కోసం హృదయ పూర్వకంగా పనిచేశా. ఈ సందర్భంగా బీసీసీఐ, రవిశాస్త్రి, ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు చెప్పాలి. మరీ ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో నా మీద నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనీకి కృతజ్ఞతలు’’ అని విరాట్ పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓడిపోవడంతో విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వన్డే సారథ్యం సంబంధించి కోహ్లీ, బీసీసీఐ మధ్య చోటు చేసుకున్న కామెంట్లు కూడా కారణం అయిండొచ్చని మరికొంతమంది అంచనా వేస్తున్నారు.