ఎన్నికలు (Elections)

విశాఖ మేయర్ పీఠానికి మార్చి 10న జీవీఎంసీ ఎన్నికలు

విశాఖ నగరంలోని 98 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2వ తేదీనుంచి ఈ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిందో.. తిరిగి అక్కడినుంచే మొదలుపెట్టేందుకు అధికారులు సోమవారం రంగంలోకి దిగారు. జీవీఎంసీ ఎన్నికల అధికారి పి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కోడ్‌ను అమల్లోకి తెస్తూ అన్ని జోన్ల రిటర్నింగ్‌ అధికారులకూ ఆదేశాలు జారీచేశారు. దీంతో వారంతా తమతమ విధుల్లో చేరిపోయారు. మార్చి పదిన జీవీఎంసీకి ఎన్నికలు జరగనున్నాయి.
నగరంలో జోన్‌లు 8
మొత్తం వార్డులు 98
మేయర్‌ రిజర్వేషన్‌ బీసీ జనరల్‌
అనకాపల్లి జోన్‌లోని 82వ వార్డులో తెదేపా తరఫున నామినేషన్‌ వేసిన ఆళ్ల ఇందు పత్రాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఓటరు జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో అక్కడి ఎన్నికల అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు ఓటు హక్కు ఉందని నిరూపించుకునేందుకు గతేడాది మార్చి 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ గడువిచ్చారు. 15నే ఎన్నికల ప్రక్రియ వాయిదాపడింది. ఆమెకిప్పుడు మళ్లీ అవకాశం రావొచ్చని చెబుతున్నారు.
మొత్తం నామినేషన్లు 1361
ఆమోదం పొందినవి 1262
తిరస్కరణకు గురైనవి 99
ఎన్నెన్ని రోజులు పట్టిందో

  • నగరానికి 2012 ఫిబ్రవరిలో పాలవర్గం గడువు తీరిపోయింది. అప్పటినుంచి ఎన్నికలు జరగాల్సి ఉండగా పలు కారణాలతో జరగలేదు. 2020 మార్చి 9న ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో 8 ఏళ్ల తర్వాత ఎన్నికలకు మార్గం సుగమమైనట్లయింది.
  • గతేడాది 18 రోజుల్లోనే ఎన్నికల్ని పూర్తిచేయాలని అప్పటి నోటిఫికేషన్‌లో ప్రకటించారు. కానీ, కేవలం ఆరురోజుల ప్రక్రియ జరిగిన తర్వాత.. కొవిడ్‌ కారణంగా అర్ధంతరంగా ఎన్నికలు వాయిదాపడ్డాయి.
  • అప్పటినుంచి నగర ఎన్నిక దోబూచులాడుతూనే వచ్చింది. వ్యవహారం కోర్టు కేసులు దాటి.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయని ఎన్నికల కమిషన్‌ భావించడంతో దాదాపు 336రోజుల తర్వాత సోమవారం అదే ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది.
  • అయితేే ఎన్నికలు కొనసాగిస్తున్నప్పటికీ.. తాజా నోటిఫికేషన్‌ నుంచి లెక్కింపు దాకా 27 రోజుల సమయమిచ్చింది. గతేడాది ఆరు రోజుల ప్రక్రియ, ఇప్పుడు 27రోజుల ప్రక్రియ.. ఈ ఎన్నికకు మొత్తం 33రోజుల సమయం.
  • కొవిడ్‌ విరామంతో లెక్కేస్తే.. గతేడాది మార్చి 9 నుంచి ఈ ఏడాది మార్చి 14దాకా మొత్తం దాదాపు 370 రోజుల సమయం పడుతోంది.
    మొత్తం ఓటర్లు ..17,53,927
    పురుషులు 8,80,481
    మహిళలు 8,73,320
    ఇతరులు.. 126
    గతేడాది నామినేషన్‌ పత్రాల పరిశీలన తర్వాత ఇక ఎన్నిక నుంచి తప్పుకోవాలనుకున్నవారు మరో రోజులో ఉపసంహరించుకుంటారన్న సమయంలోనే ఎన్నిక వాయిదా పడింది. మరోవైపు ప్రధానపార్టీల నుంచి పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఇందులో ఇప్పుడు ఎవరు ప్రధాన అభ్యర్థి అవుతారనే సందేహం ఒకటైతే.. తమ అభ్యర్థి తమ పార్టీలోనే ఉంటారా లేక, నామపత్రం ఉపసంహరించుకుని ఇంకో పార్టీవారితో కలిసిపోతారా అనేది మరో సందేహం. గతేడాది నామపత్రాల పరిశీలనయ్యాక 352 రోజుల విరామంతో నామ పత్రాల ఉపసంహరణ తేదీల్ని ఇచ్చారు. ఈమధ్య కాలంలో రాజకీయంగా ఎన్నో మార్పులొచ్చాయి. నాయకులు పార్టీలు మారారు. ప్రాథమికంగా ఏ వార్డులో ఏం జరగబోతోందనేది వచ్చే నెల 3వ తేదీ దాకా వేచి ఉండాల్సిందే.
    పోలింగ్‌ కేంద్రాలు 1712
    అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు 2200
    అవసరమైన పోలింగ్‌ సిబ్బంది 10,600
    మొత్తం రూట్‌లు 204

    మేయర్ పీఠానికి సమరం విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న విషయం నగర వాసుల్లో, నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన వైకాపాకు విశాఖ నగరంలో ఎదురుగాలి వీచింది. నగరంలోని నాలుగు కీలక నియోజకవర్గాలనూ తెదేపా సొంతం చేసుకుంది. అనంతర పరిణామల్లో రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించారు. ఆ నిర్ణయంతో నగరంలో వైకాపా బలోపేతం అవుతుందని భావించారు. రాజధాని ప్రకటన తమకు లాభిస్తుందని ఆ పార్టీ పెద్దలు అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా ఉక్కు కర్మాగారం అంశం తెరపైకి వచ్చింది. విశాఖ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయానికి నగరవాసుల నుంచి వ్యతిరేకత వస్తోంది. వైకాపా కూడా ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఆ మేరకు కేంద్రంపై విమర్శలు కూడా చేస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక కేంద్రాన్ని ఒప్పించి కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ ప్రకటన వెలువడేలా చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
    నానాటికీ తీవ్రమవుతున్న పోరు: ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం, తెదేపా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిరాహారదీక్షకు దిగడంతో ఉక్కు ఉద్యమానికి మరింత బలమిచ్చింది. వారి నిర్ణయాలకు ఉక్కు ఉద్యోగుల నుంచి స్పందన లభిస్తోంది. రోజురోజుకూ ఉక్కు ఉద్యమం మరింత బలోపేతం అవుతుండడంతో కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది.
    నగరవాసుల తీర్పే కీలకం: నగరవాసులు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్న విషయాన్ని కూడా కార్పొరేషన్‌ ఎన్నికలే తేల్చనున్నాయి. నగరంలోని వార్డులు 72 నుంచి 98కి పెరిగాయి. అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు, పది పంచాయతీలను నగర పరిధిలోకి తెచ్చారు. వారి మనోగతమూ కీలకంగా మారే అవకాశం ఉంది.
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.