భారత్‌లో రైతుల నిరసనలకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన ‘టూల్‌కిట్’ మీద నమోదైన కేసుకు సంబంధించి.. బెంగళూరుకు చెందిన విద్యార్థి, పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అరెస్టును తప్పుబడుతూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొదలుకొని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు వరకు అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది? దిశ రవి ఎవరు? ఈ కేసు ఏమిటి?
ఇండియాలో ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ ప్రచార అధ్యాయాన్ని ప్రారంభించిన వారిలో 22 ఏళ్ల దిశా రవి ముఖ్యులు.
దిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు శనివారం సాయంత్రం ఆమెను బెంగళూరులో అరెస్ట్ చేశారు.
గ్రేటా థన్‌బర్గ్ రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన తరువాత నమోదైన కేసుల్లో ఇది మొదటి అరెస్ట్.
బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్యకర్త తారా కృష్ణస్వామి, దిశ గురించి బీబీసీతో మాట్లాడుతూ.. “పర్యావరణ పరిరక్షణ కోసం మేము చేపట్టే వివిధ కార్యక్రమాల గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా తనతో నాకు పరిచయం లేదు. కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఆమె ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదు. ఒక్కసారి కూడా అలాంటి పని చేసిన దాఖలాలు లేవు. ఇదొక్కటే కాదు, అనేక ఉద్యమాలకు సంబంధించిన సంస్థలన్నీ కూడా చట్టబద్ధంగానే పనిచేస్తాయి. దిశ ఎప్పుడూ వాటన్నిటికీ నిజాయితీగా, శాంతియుతంగా సహకరిస్తారు” అని అన్నారు.

దిల్లీ పోలీసులు దిశను దిల్లీ కోర్టులో హాజరుపరుస్తూ.. “దిశా రవి టూల్‌కిట్ గూగల్ డాక్యుమెంట్ ఎడిటర్. ఈ డాక్యుమెంట్‌ను తయారుచేయడంలోనూ, ప్రచారం చేయడంలోనూ ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఖలిస్తాన్ మద్దతుదారు ‘పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’తో కలిసి దిశ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేపడుతున్నారు. దిశనే ఈ టూల్‌కిట్‌ను గ్రేటా థన్‌బర్గ్‌తో పంచుకున్నారు. ఈ టూల్‌కిట్ రూపొందించడం కోసం ఒక వాట్సాప్ గ్రూప్‌ను దిశ ఏర్పాటు చేశారు. ఈ టూల్ కిట్ పైనల్ డ్రాఫ్ట్ తయారు చేసిన బృందంతో దిశ కలిసి పనిచేశారు” అని పేర్కొన్నారు.
“జనవరి 26న దేశ రాజధాని దిల్లీలో జరిగిన అల్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగాయని, అందులో ఈ డాక్యుమెంట్ పాత్ర ఉందని” వారు చెబుతున్నారు.
అయితే దిశా రవితో పనిచేసినవారందరూ ఆమె ఎంతో నిజాయితీపరురాలని, నిబద్ధత కలిగిన వ్యక్తి అని అంటున్నారు.
“దిశ చాలా చలాకీ అమ్మాయి. మంచి యువతి. కొన్నిసార్లు ఆమె కార్యక్రమాలకు ఆలస్యంగా వచ్చేవారు. కానీ, మేం ఏం అనేవాళ్లం కాదు. ఎందుకంటే ఆమె శక్తివంచన లేకుండా, చట్టాలకు అనుగుణంగా, నిజాయితీతో పనిచేస్తారు. ‘సేవ్ ట్రీస్’ (చెట్లను కాపాడండి) ఉద్యమం గురించి తనే స్వయంగా పోలీసులకు వివరించి, వారి అనుమతి తీసుకున్నారు. దిశ ఎప్పుడూ చిత్తశుద్ధితో చట్టాలకు లోబడే పనిచేశారు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కార్యకర్త వివరించారు.
“దిశ అరెస్టుతో అనేకమంది భయాందోళనలకు గురవుతున్నారని” మరొక వ్యక్తి అన్నారు.
“కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) యువతను చాలా భయపెడుతోంది. దీనివలనే 2020 జూన్‌లో ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ను నిలిపివేయాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్’ (ఈఐఏ)కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాల్సి ఉండగా దాన్ని నిలిపివేయాల్సి వచ్చింది” అని ఇంకొక వ్యక్తి తెలిపారు.
ఆ సమయంలో దిశా రవి ‘www.autoreportafrica.com’ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..”భారతదేశంలో ప్రజా వ్యతిరేక చట్టాలకు జనం బలైపోతున్నారు. అసమ్మతి గొంతు నొక్కేస్తున్న దేశంలో మేము జీవిస్తున్నాం. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ముసాయిదాను వ్యతిరేకిస్తున్న కారణంగా ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా’కు చెందిన వ్యక్తులపై తీవ్రవాదులనే ముద్ర వేస్తున్నారు. ప్రజల జీవితాలకన్నా లాభాలకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం స్వచ్ఛమైన గాలి, నీరు కోరుకోవడాన్ని తీవ్రవాదంగా పరిగణిస్తోంది” అని అన్నారు.

దిశా రవి మీద పెట్టిన కేసులు ఏంటి?
భారతీయ శిక్షా స్మృతిని అనుసరించి దేశ ద్రోహం, సమాజంలో వివిధ వర్గాల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, నేరపూరిత కుట్రల కింద దిశపై కేసులు నమోదు చేశారు.
బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో దిశ బీబీఏ డిగ్రీ చదువుతున్నారు. 2018లో గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణ దిశగా ‘సేవ్ ది ఎన్విరాన్మెంట్ క్యాంపెయిన్’తో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సమయంలోనే దిశా రవి ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా’ ప్రచారం మొదలుపెట్టారు.
భారత్‌లో వాతావరణ మార్పుల నియంత్రణకు నిర్వహిస్తున్న చాలా ఉద్యమాలు, కార్యక్రమాల్లో దిశ పాల్గొన్నారు. ఇదే అంశంపై గతంలో ఆమె బెంగళూరులో నిరసనలు చేపట్టారు. వాతావరణ మార్పులతో చుట్టుముట్టే ముప్పులపై మీడియాలో ఆమె వ్యాసాలు కూడా రాస్తుంటారు.
అయితే, నిరసన ప్రదర్శనలలో పాల్గొనడం కంటే ఎక్కువగా చెరువులు, నదులను శుభ్రం చేయడం, చెట్లను నరక్కుండా కాపాడడం మొదలైన కార్యక్రమాలలో పాల్గొనడానికే ఆమె మొగ్గు చూపుతారు.
“ఆమె ఇంకా విద్యార్థే. ఒక వర్క్‌షాప్‌లో ఆమె ఇచ్చిన ప్రజంటేషన్ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి భూమిని కాపాడడం గురించి ఇంత బాగా ఆలోచిస్తోందే అని విస్మయం కలిగింది” అని మరో పర్యావరణ కార్యకర్త ముకుంద్ గౌడ్ తెలిపారు.
“ఆమె ప్రతీ శుక్రవారం విద్యార్థులతోనూ, చుట్టుపక్కల ప్రజలతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిగిస్తారు. జీవ కారుణ్యాన్ని కాంక్షిస్తారు. ఆమె గురించి చెప్పడానికి, మాట్లాడడానికి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఆమెకు మద్దతు తెలుపుతూ సానుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ అందరూ భయపడుతున్నారు. అందుకే అనేకమంది మౌనం వహిస్తున్నారు” అని మరొక కార్యకర్త తెలిపారు.
దిశ అరెస్ట్ యువతను భయపెట్టిందని తారా కృష్ణస్వామి కూడా అంగీకరించారు.
“నాకు కూడా భయం వేస్తోంది. మేము అన్ని విషయాలను శాంతియుతంగా పరిష్కరించడానికే మొగ్గు చూపుతాం. పోలీసుల అనుమతి తీసుకోకుండా ఏ పనీ చెయ్యం. యువతను ఇలా లక్ష్యంగా చేసుకోవడం చాలా విచారకరం” అని ఆమె అన్నారు.
ప్రస్తుతం దిశను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ కూడా సీజ్ చేశారు. అయితే, దిశను కస్టడీకి పంపించాలనే నిర్ణయం తీసుకొనే సమయంలో ఆమె తరపు లాయర్ కోర్టులో లేకపోవడంపై నిపుణులు నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లాయర్ లేని సమయంలో ఆమెను పోలీసు కస్టడీకి పంపించండంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
“పాటియాలా హౌస్ కోర్టు డ్యూటీ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. తన తరపున వాదించడానికి న్యాయవాది అందుబాటులో ఉన్నారో లేదో కూడా తెలుసుకోకుండా ఒక యువతిని ఐదు రోజుల రిమాండ్‌పై పోలీస్ కస్టడీలోకి పంపించారు. మెజిస్ట్రేట్ ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. రాజ్యాంగలోని ఆర్టికల్ 22 కచ్చితంగా పాటించేలా చూడాలి. విచారణ సమయంలో నిందితురాలి తరపు న్యాయవాది హాజరు కాకపోతే వకీలు వచ్చేవరకు వేచి చూడాలి లేదా ప్రత్యామ్నాయాలను సూచించాలి. కేసు డైరీ, మెమో తనిఖీ చేశారా? బెంగళూరు కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ లేకుండా ఆమెను నిర్బంధించి నేరుగా ఇక్కడి కోర్టుకు ఎందుకు తీసుకొచ్చారని మెజిస్ట్రేట్ స్పెషల్ సెల్ అధికారులను ప్రశ్నించిందా? న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఈ అంశాలనీ కూడా షాక్ కలిగిస్తున్నాయి” అని సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది రెబెకా జాన్ సోషల్ మీడియాలో రాశారు.
“ఒకవేళ ఏదైనా తప్పు చేశారనిపిస్తే ఆమెను ముందు పోలీస్ స్టేషన్లో విచారించాలి. నేరుగా దిల్లీ కోర్టులో హాజరు పరచడానికి ఎందుకు తీసుకెళ్లారు? టెక్నాలజీ గురించి సరైన అవగాహన లేకపోవడం వలన ఈ విషయంలో గందరగోళం తలెత్తిందనిపిస్తోంది” అని తారా కృష్ణస్వామి అన్నారు.
ఏమిటీ టూల్‌కిట్?
‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నుంచి ‘యాంటీ లాక్డౌన్ ప్రొటెస్ట్’ వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికతో నిరసనకారులు ఒక డాక్యుమెంట్ రూపొందిస్తారు. దీనినే ‘టూల్‌కిట్’ అంటారు.
ఈ డాక్యుమెంట్ కోసం సోషల్ మీడియాలో ‘టూల్‌కిట్’ అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందులో సోషల్ మీడియా వ్యూహంతోపాటు, నిరసన ప్రదర్శనల సమాచారం కూడా ఇస్తుంటారు. ఉద్యమం ప్రభావాన్ని పెంచడానికి సాయపడగలవారికి ఈ టూల్‌కిట్‌ను తరచూ షేర్ చేస్తుంటారు.
“టూల్‌కిట్ అనేది ఒక పత్రంలాంటిది. పరస్పర సహకారం, సమన్వయంకోసం ఉపయోగించేది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు కూడా దీన్ని వినియోగిస్తాయి. దీన్ని ఎవరికీ వ్యతిరేకంగా ఉపయోగించరు.
ఎవరైనా ఎక్కడినుంచైనా గూగల్ డాక్యుమెంట్ ఎడిట్ చెయ్యొచ్చు. అందరి ఆలోచనలను అందులో పొందుపరిచి.. అన్నీ ఒకేచోట ఉండేలా చేయొచ్చు. దీన్ని ఎవరు ముందు సవరించారు, ఎవరు తరువాత సవరించారు అనే విషయాలేం తెలీవు. ఇది డిజిటల్ ప్రపంచం. ఎవరైనా ఎక్కడినుంచైనా ఎడిట్ చెయ్యొచ్చు. నిజం చెప్పాలంటే వయసు పైబడినవాళ్లు, వృద్ధులు ఈ దేశాన్ని నడుపుతున్నారు. వారికి టెక్నాలజీ గురించి ఏమీ తెలీదు” అని తారా కృష్ణస్వామి అభిప్రాయపడ్డారు.
వీగన్ మిల్క్ (పూర్తి శాకాహార పాలు) ప్రోత్సహించే ఒక స్టార్టప్ కంపెనీ కోసం దిశా రవి పనిచేస్తున్నారు.
“దిశ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ప్రస్తుతం తన కుటుంబం తన సంపాదన మీదే నడుస్తోంది. చాలా చిన్నప్పటినుంచీ ఆమె కుటుంబం నాకు బాగా తెలుసు. ఆమె తండ్రి ఆరోగ్యం బాగోలేదు. తల్లి గృహిణి. కొద్ది రోజుల ముందు, పొద్దున్న ఏడు గంటల నుంచీ తొమ్మిది వరకూ, మళ్లీ సాయంత్రం ఏడు నుంచీ తొమ్మిది వరకూ చేయగలిగేలా ఏదైనా పని ఉంటే ఇప్పించమని ఆమె నన్ను అడిగారు” అని ఆ స్టార్టప్‌కు చెందిన, పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి తెలిపారు.
“ఇది చాలా విచారకరం. నిరాశ నిస్పృహలను కలిగిస్తోంది. చెట్లను, పర్యావరణాన్ని కాపాడాలనుకునే పిల్లలను దేశ ద్రోహులుగా చిత్రీకరించి భయపెడుతున్నారు” అని మరొక కార్యకర్త తెలిపారు.
దిశకు ప్రముఖుల మద్దతు
దిశకు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇప్పటికే ఆమెకు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు.
21 ఏళ్ల దిశను అరెస్టు చేయడమంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, రైతులకు మద్దతు ప్రకటించడం నేరం కాదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. భారత్ నోరు నొక్కేయలేరని చెబుతూ దిశ అరెస్టుకు సంబంధించిన వార్తలను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఎలాంటి ఆయుధాలూ లేని ఒక సాధారణ అమ్మాయిని చూసి తుపాకులున్న వారు భయపడుతున్నారని, ఆ అమ్మాయిని చూస్తుంటే వారిలో ధైర్యం నీరుగారిపోతోందని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. ”ఇండియా బీయింగ్ సైలెన్సెడ్, రిలీజ్ దిశా రవి” హ్యాష్‌ట్యాగ్‌లను ఆమె జోడించారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేన కోడలు మీనా హ్యారిస్ కూడా దిశ అరెస్టుపై
స్పందించారు. ”ఒక యువ పర్యావరణ ఉద్యమకారిణిని భారత అధికారులు అరెస్టు చేశారు. రైతుల ఉద్యమానికి సంబంధించిన టూల్‌కిట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక కార్యకర్తల నోరును ఎందుకు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారో ఒకసారి భారత ప్రభుత్వం ఆలోచించుకోవాలి” అని ఆమె ట్వీట్ చేశారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ కూడా దిశకు మద్దతుగా స్పందించింది. కశ్మీర్లో ప్రజల గొంతు నొక్కేస్తున్నట్లే, వారికి వ్యతిరేకంగా మాట్లాడే అందరి నోర్లనూ మోదీ, ఆరెస్సెస్ ప్రభుత్వం మూయించాలని అనుకుంటోందని విమర్శించింది. దీనికోసం క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలనూ ఉపయోగించుకుంటోందని ట్విటర్లో ఆరోపించింది.
దిశను కసబ్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ
బీజేపీ సీనియర్ నేత, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్… దిశను 2008 ముంబయి దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ తీవ్రవాది మహమ్మద్ అజ్మల్ కసబ్‌తో పోల్చారు. బుర్హాన్ వనీ, కసబ్ వయసు కూడా 21 ఏళ్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక నేరం, ఎప్పుడూ నేరమే అవుతుందని ట్వీట్ చేశారు. మోహన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున నిరసన వ్యక్తమవుతోంది.