తెలంగాణాలో పలు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.

కామారెడ్డిలోని టేక్రియాల్‌ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 140 మందికి కొవిడ్‌ టెస్టులు చేయగా 32 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డా. చంద్రశేఖర్ తెలిపారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించినట్లు చెప్పారు.

గత కొన్ని రోజులుగా విద్యార్థులు బయటకు వెళ్లడం, తల్లిదండ్రులు పాఠశాలకు రావడం లాంటి కారణాలతో కొవిడ్‌ వ్యాప్తి జరిగి ఉండొచ్చన్నారు. ప్రత్యేక మొబైల్ వైద్య బృందాల ద్వారా అన్ని వసతి గృహాలు, పాఠశాలల్లో కరోనా నిర్ధారణ పరీక్షల జరిపేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా పట్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చంద్రశేఖర్ విన్నవించారు .

హైదరాబాద్‌ నాగోల్‌ పరిధి బండ్లగూడకు చెందిన మైనారిటీ గురుకుల పాఠశాలలో 36 మంది బాలికలకు కొవిడ్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు.