సోమవారం చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతరకు ఒక నాలుగేళ్ల చిన్నారి తల్లితో కలిసి చూడడానికి వచ్చింది. వారు అమ్మవారిని దర్శించుకుని సంతోషంగా తిరిగి వెనుకకు వస్తుండగా వెనుక నుంచి తాగునీటి ట్యాంకరుతో వస్తున్న ట్రాక్టరు ప్రమాదవశాత్తు ఢీకొంది. చిన్నారి ప్రసన్న తల మీదుగా ట్రాక్టర్‌ చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందగా బాలిక తల్లి రాధ, పెద్దమ్మ నాగలక్ష్మి, ఆమె కుమారుడు సిద్ధు గాయపడ్డారు. అనుకోని ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. వీరు శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందినవారు. క్షతగాత్రులను 108 వాహనంలో చీపురుపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించారు.