సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపుకు సంబంధించి, కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్‌పూలింగ్‌లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేసి ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో క్రమబద్దీకరణ చేయడానికి అనుమతించారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

రాజధాని అసైన్డ్‌ భూముల విషయంలో ఎన్నెన్ని అక్రమాలు, అవకతవకలు జరిగాయో, దళితులు, నిరుపేదలు ఎంత దారుణంగా మోసపోయారో, ఎంతగా అన్యాయం అయిపోయారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక పథకం ప్రకారమే చవకగా తమ భూములను అమ్ముకునేలా చేసి, రాజధాని ప్రాంతంలో అసైన్ఢ్‌ భూములకు ఎలాంటి ప్లాట్లు రావని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడమే కాకుండా, అసైన్డ్‌ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగి, బలవంతంగా వాటిని కొనుగోలుచేశారు. దీనికోసం అధికారపార్టీ నాయకులు సబ్‌రిజిస్ట్రార్లపై కూడా విపరీతమైన ఒత్తిడి తీసుకు వచ్చి వారికి కావలసిన విధంగా నడచుకునేలా చేసారు.

దాని తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్నవాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీచేశారు. ఇలా అసైన్డ్‌భూములను కొనుగోలుచేసి, వాటిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నప్పుడే ఏమి జరిగి ఉండవచ్చనే విషయం సామాన్యులకు సులభంగా అర్ధమైపోతుంది. నారాలోకేష్‌ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారాలోకేష్‌ సన్నిహితుడు గుమ్మడి సురేష్‌ 42.925 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్‌ను దక్కించుకున్నారు. నారాలోకేష్‌ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను తక్కువకే పొందారు. మొత్తంగా 338. 887 ఎకరాల అసైన్డ్‌ భూములను ఈ రకంగా తక్కువకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లాభాలు సంపాదించారు.

అందుకే అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి దీనికి సంబంధించిన నోటీసులను అందజేశారు. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ (సీఆర్‌పీసీ) కింద నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి.