సికింద్రాబాద్‌ రైల్వే డిజాస్టర్‌ రికవరీ కేంద్రం అప్రమత్తత కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థలో పెద్ద ఆటంకం తప్పింది. దాదాపు 15 రాష్ట్రాల్లో రైల్వే టిక్కెట్ల జారీ, రిజర్వేషన్‌ బెర్తుల కేటాయింపు ప్రక్రియలకు ఆటంకం కలగకుండా నిలువరించడం ద్వారా వందల రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయే ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. రిజర్వేషన్ల టిక్కెటింగ్‌ వ్యవస్థతో పాటు రైల్వేకు సంబంధించి ఇతర సాంకేతిక వ్యవస్థను క్రిస్‌ పర్యవేక్షిస్తుంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైల్లో ఈ కేంద్రాలున్నాయి. చెన్నై కేంద్రానికి అనుబంధంగా ప్రాంతీయ కేంద్రం సికింద్రాబాద్‌లో ఉంది.

కోల్‌కతాలో రైల్వేకు సంబంధించిన 13 అంతస్తుల భవనంలో మార్చి 8న సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా 9 మంది చనిపోయారు. ఈ భవనంలోనే క్రిస్‌ సమాచార కేంద్రం ఉంది. అగ్నిప్రమాదం కారణంగా ఈ కేంద్రంతో పాటు రైల్వేకు సంబంధించి అన్ని కార్యాలయాలకు విద్యుత్ సరఫరాతోపాటు ఇతర సేవలన్నింటినీ నిలిపివేశారు. ఆ రోజు రాత్రి 7.30 గంటల నుంచి రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ల కేంద్రాలతోపాటు ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌ పూర్తిగా నిల్చిపోయింది. జనరల్‌ టికెట్ల విక్రయాలు కూడా ఆగిపోయాయి.

ఈ ఘటనతో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. గోదావరి, ఈస్ట్‌కోస్ట్‌, విశాఖ, హౌరా బండ్లపైనా ప్రభావం పడే పరిస్థితి రావడంతో రైల్వే ఉన్నతాధికారులు వెంటనే సికింద్రాబాద్‌ క్రిస్‌ ప్రాంతీయ కేంద్రం జీఎం రవిప్రసాద్‌ పాడిని అప్రమత్తం చేశారు. వెంటనే ఆయనతోపాటు ఇతర సాంకేతిక సిబ్బంది మూడున్నర గంటలపాటు కష్టపడి 15 రాష్ట్రాల్లో రైల్వే సేవలకు అంతరాయం కలగకుండా, ఆరు జోన్లలోని రిజర్వేషన్‌ కేంద్రాలను ఈ డిజాస్టర్‌ డేటా సెంటర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఆటంకాన్ని ఆపారు. ఆ రోజు రాత్రి నుంచి 13వ తేదీ తెల్లవారుజాము వరకు వ్యవస్థలన్నీ ఈ కేంద్రం ద్వారానే పనిచేశాయి. 24 గంటలూ ఉద్యోగులు విధులు నిర్వర్తించారు.