వార్తలు (News)

బస్సు ప్రమాదంలో ఒకరి మృతి, 23 మందికి గాయాలు

సోంపేట మండలం లక్కవరం కూడలి వద్ద సోమవారం ఉదయం ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఒడిశాలోని నవరంగ్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన ట్రావెల్‌ బస్సు లారీని ఢీకొనడంతో నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. డివైడర్‌ మధ్యలో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. బస్సు క్లీనర్‌ సుధీర్‌ సాగరియా(33) అక్కడికక్కడే మృతిచెందారు. 8 మందికి తీవ్ర గాయాలవగా, మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం ట్రావెల్‌ బస్సు ఒడిశాలోని నవరంగ్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా లక్కవరం వద్ద ముందుగా వెళ్తున్న లారీని తప్పించబోయి ఢీకొంది. అతివేగంగా వెళ్తున్న బస్సుని డ్రైవర్‌ అదుపులోకి తీసుకురాలేకపోవడంతో రోడ్డు పక్కన స్తంభాలను ఢీకొట్టి పక్కనున్న డివైడర్‌ పైకెక్కి ఆగింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు భాగం మొత్తం నుజ్జునుజ్జుయింది. ద్వారం వద్దనున్న క్లీనర్‌ రోడ్డుపై పడి దుర్మరణం పాలయ్యాడు. వేకువజాముకావడంతో ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్నారు. బస్సు కుదుపులకు ఉలిక్కిపడి నిద్ర నుంచి తేరుకొని పరిస్థితిని చూసి అరుపులు, రోదనలతో బయటపడేందుకు ప్రయత్నించారు. ఎడమవైపు బస్సు భాగానికి నష్టం జరగడంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్‌ నిద్ర లేమి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్‌ మద్యంమత్తులో ఉన్నందునే వేగంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణం అయ్యాడని లారీని ఢీకొన్న తరువాత బస్సు అడ్డదిడ్డంగా వెళ్తూ డివైడర్‌ పైకి వచ్చి నిలిచిందని బాధితులు వివరించారు.

బస్సులో సరకుల కేరియర్‌ దిగువభాగంలో ఉండడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రెండడుగులకు పైగా కిందిభాగంలో సరకుల రవాణాకు ఏర్పాటుచేసిన భాగం ప్రమాదంలో నుజ్జునుజ్జవడంతో దాని పైభాగంలోని ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. సాధారణ బస్సులా దిగువన సీట్లు ఉండి ఉంటే ప్రాణనష్టం భారీగా జరిగి ఉండేదని పోలీసులు పేర్కొంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.