మంగళవారం స్టాక్ మార్కెట్ లు లాభాలతో ప్రారంభమై చివరకు స్తబ్దుగా ముగిశాయి. ఈరోజు ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేసిన సూచీలు నెమ్మదిగా కిందకు దిగజారి మధ్యాహ్నానికి పూర్తిగా నష్టాలు చవిచూశాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభ లాభాలు అన్నీ మాయమైపోయాయి. ఉదయం 50,608 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 50,857 వద్ద గరిష్ఠాన్ని తాకి, మధ్యాహ్నం తర్వాత 50,289 వద్ద కనిష్ఠానికి చేరుకుని ఇక చివరకు 31 పాయింట్లు నష్టపోయి 50,363 వద్ద ఆగింది. ఇక నిఫ్టీ అయితే 14,996 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టి, రోజులో 15,051 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 14,890 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసి, చివరకు 19 పాయింట్లు నష్టపోయి 14,910 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.58 వద్ద నిలవడంతో అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా సూచీలు దాదాపు అన్నీ లాభాల్లో ముగీసినా కూడా దేశీయంగా కీలక రంగాల సూచీలు నష్టాల్లోకి జారుకోవడం వల్లే నేడు సూచీలను దెబ్బతిన్నాయి.

ఆర్థికం, బ్యాంకింగ్, లోహ, స్థిరాస్తి రంగాల సూచీలు నష్టాల్లో టెలికాం, టెక్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌ షేర్లు లాభాలను ఆర్జిస్తే టాటా స్టీల్‌, సిప్లా, ఎల్‌అండ్‌టీ, భారత్‌ పెట్రోలియం, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూసాయి.