హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్పై వసూలు చేసే టోల్ ఛార్జీలను 3.5శాతం పెంచుతూ హెచ్‌జీసీఎల్(హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ) నిర్ణయం తీసుకుంది.
తాజా పెంపుదలతో ప్రతి కిలోమీటర్‌కు 6పైసల నుంచి 39 పైసల వరకు టోల్ఛార్జీ పెరగనుంది. ఔటర్ రింగు రోడ్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న హెచ్‌జీసీఎల్‌కు జీవో నం. 365 క్లాజ్ 5 ప్రకారం నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు టోల్ రూల్స్-2012ను ఏటా కొంత మేర టోల్ ఛార్జీలు పెంచేందుకు అవకాశం ఉండడంతో మళ్ళీ చార్జీలు పెంచడంతో నేటి(శుక్రవారం) నుంచి అమలులోకి వచ్చాయి.
హైదరాబాద్ మహానగరం చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఓఆర్ఆర్పై రోజూ 1.20 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. టూ టైర్, త్రీ టైర్ వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలు ఓఆర్ఆర్పై రాకపోకలు సాగించవచ్చు. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఓఆర్ఆర్పై రాకపోకలు భారీగా పెరగడంతో వాహనాల రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ చుట్టూ హెచ్ఎండీఏ రకరకాల అభివృద్ధి పనులను చేపడుతోంది.