ప్రముఖ వైద్య నిపుణులు, హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మాజీ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగానికి కాకర్ల సుబ్బారావు అందించిన సేవలు, నిమ్స్ డైరెక్టర్‌గా ఆయన చేసిన కృషి అజరామరం. అనారోగ్యంతో నెల రోజుల క్రితం కిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన కాకర్ల చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయారు. ఆయన వయసు 94 ఏళ్లు.

1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కాకర్ల సుబ్బారావు బాల్యంలో చల్లపల్లిలో చదివి కాలేజీ విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో పూర్తి చేసిన తర్వాత విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్‌ పట్టా అందుకున్నారు. 1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన కాకర్ల, తర్వాత ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లి అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. కాకర్ల న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని ఆస్పత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు.

1956లో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరి తర్వాత ఉస్మానియా కాలేజీలో ప్రధాన రేడియాలజిస్టుగా ప్రమోషన్ పొందిన పిమ్మట 1970లో మళ్లీ అమెరికా వెళ్లి సుబ్బరావు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వారి ఫెల్లో ఆఫ్‌ రాయల్‌ కాలేజి ఫెలో రేడియాలజిస్టు పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని చాలా అస్పత్రుల్లో పనిచేసి 1986లో ఎన్టీ రామారావు ప్రవాసాంధ్రులకు ఇచ్చిన పిలుపు మేరకు స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌ నిమ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. రేడియాలజీలో 50 ఏళ్ల అనుభవంలో ఆయన ఎన్నో బహుమతులు, సత్కారాలు పొందారు. వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుబోధ్ కందముతన్ కాకర్ల ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు. పలువురు కాకర్ల ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేస్తున్నారు.