క్రైమ్ (Crime) వార్తలు (News)

మధురవాడ ఘటనలో కొడుకే యముడయ్యాడా??

విశాఖపట్నం మదురవాడలో గురువారం తెల్లవారుజామున ఆదిత్య ఫార్చూన్‌ టవర్స్‌ సి-బ్లాక్‌ ఫ్లాట్‌ నెంబరు 505లో సుంకరి బంగారునాయుడు(50) కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది.

విశాఖపట్నం శివారు మధురవాడ మిథిలాపురి కాలనీ ఆదిత్య ఫార్చూన్‌ టవర్స్‌ సి-బ్లాక్‌ ఫ్లాట్‌ నెంబరు 505లో సుంకరి బంగారునాయుడు(50) తన కుటుంబంతో ఉంటున్నారు.
20 ఏళ్లపాటు బహ్రెయిన్‌లో నివసించి మూడేళ్ల క్రితమే విశాఖ వచ్చారు. ఆయన భార్య నిర్మల (45) హోమియో వైద్యురాలు. పెద్దకుమారుడు దీపక్‌ (25) వరంగల్‌ నిట్‌లో ఇంజినీరింగ్‌ చదివి, దిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకుని, కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నాడు. చిన్నకుమారుడు కశ్యప్‌(19) ఇంటర్‌ చదువుతున్నాడు.

గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల తర్వాత బంగారునాయుడి ఫ్లాట్‌ నుంచి అరుపులు వినిపిస్తున్నాయని ఓ మహిళ వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేయడంతో భద్రతాసిబ్బంది వెళ్లి చూసి ఏమీ లేకపోవడంతో కిందికి వచ్చేశారు. నాలుగు గంటలకు ఫ్లాట్‌ నుంచి పొగలు వస్తున్నాయని గుర్తించి మళ్లీ ఆమే గ్రూపులో పెట్టారు. మరికొందరు కూడా లేచి 505 ఫ్లాట్‌ దగ్గరకు వెళ్లి చూసి అగ్నిప్రమాదమని భావించి అందరూ కిందికి వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి తలుపులు కొట్టినా ఎవరూ తీయకపోవడంతో వాటిని బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు.

ప్రధానద్వారం పక్కనే బంగారునాయుడి మృతదేహం పడి ఉంది. హాల్లోనే మరోచోట డాక్టర్‌ నిర్మల మృతదేహం బోర్లా పడి ఉంది. లోపల గదిలో కశ్యప్‌ మృతదేహం వెల్లకిలా నగ్నంగా పడి ఉంది. బంగారునాయుడి శరీరంపై కత్తిపోట్లు ఉండగా చిన్న కుమారుడు, నిర్మల వంటిపై గాయాలు ఉన్నాయి. దీపక్‌ మాత్రం సూట్‌, టై ధరించి ముస్తాబైనట్లు పోలీసులు గుర్తించారు. ఆయన పారిపోవడానికి ప్రయత్నించినట్లు అక్కడి దృశ్యాలను బట్టి అర్థమవుతోందని, ముగ్గురినీ హతమార్చి తగలబెడదామన్న ఆలోచనతో ఇంట్లో నిప్పంటించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పొగ తీవ్రంగా రావడంతో తనను తాను కాపాడుకోవడానికి పంపు తిప్పాడని అయినప్పటికీ అతను ఉక్కిరిబిక్కిరై మృతిచెంది ఉంటాడని చెబుతున్నారు. ఫ్లాట్లో దట్టంగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది నీళ్లు కొట్టారు. దీంతో కొన్ని సాక్ష్యాలు చెల్లాచెదురైనట్లు, మృతదేహాలపై ఉన్న గాయాల ఆధారంగా అవి హత్యలేనని తేల్చినట్టు పోలీస్లు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.