దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌ నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలను టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖండిస్తూ క్రికెట్‌ నుంచి విరామం కావాలని తాను బీసీసీఐని సంప్రదించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత విరాట్‌ కోహ్లీ తొలిసారి మీడియా ముందుకొచ్చి దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొన్ని కీలక విషయాలు మాట్లాడాడు. వన్డే కెప్టెన్సీ మార్పు గురించి, వన్డే సిరీస్‌లో పాల్గొనడంపై వస్తున్న పుకార్ల విరాట్‌ చెప్పిన ఏడు ముఖ్యమైన అంశాలు ఏంటంటే..

దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌ నుంచి విరామం కావాలని బీసీసీఐని సంప్రదించలేదు. సెలెక్టర్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో పాల్గొంటాను. వన్డే సిరీస్‌కు నేను అందుబాటులో ఉండనని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని కోహ్లీ వెల్లడించాడు. టెస్టు జట్టును ప్రకటించడానికి గంటన్నర ముందు సెలెక్టర్లు నన్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. టెస్టు జట్టు ఎంపిక కోసం కాల్‌ చేశారు.. ఆ కాల్‌ కట్‌ చేయడానికి ముందు ‘వన్డే కెప్టెన్సీ నుంచి నిన్ను తప్పిస్తున్నాం’ అని చెప్పారు. వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో బీసీసీఐ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నేను అర్థం చేసుకోగలను. కెప్టెన్‌గా నాకు అప్పగించిన బాధ్యతలను నిజాయతీగా నిర్వర్తించాను. జట్టు కోసం శాయశక్తులా శ్రమించాను.

టీ20 నాయకత్వాన్ని వదిలేయడాన్ని నా కెరీర్లో ఒక విప్లవాత్మకమైన మార్పుగా భావించాను. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా బీసీసీఐ అధికారులకు సమాచారం ఇవ్వగా అప్పుడు వారి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. వన్డేలకు, టెస్టులకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని బీసీసీఐకి అప్పుడే తెలియజేశాను. 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు కెప్టెన్‌గా కొనసాగుతానని చెప్పాను. కానీ నిర్ణయాన్ని వాళ్ళే తీసుకొని వన్డే కెప్టెన్సీని రోహిత్‌ శర్మకు అప్పగించారు. నాకు, రోహిత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. గత రెండు సంవత్సరాలుగా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పి చెప్పి అలసిపోయాను. నా చర్యలు గానీ, నిర్ణయాలు గానీ జట్టు స్థాయిని దిగజార్చేలా ఉండవు. వ్యూహాల విషయంలో రోహిత్‌ సమర్థవంతమైన నాయకుడు. హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి జట్టును మరింత మెరుగ్గా ముందుకు నడిపిస్తాడనుకుంటున్నాను. టీ20, వన్డే క్రికెట్లో వారికి నా సంపూర్ణ సహకారం అందిస్తానని అన్నారు.