వార్తలు (News)

సరికొత్త సైబర్ నేరాలు-కేవైసీ పేరుతో వచ్చే ఫోన్లను నమ్మితే ఖాతా ఖాళీ

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను అడ్డంగా చీట్ చేస్తున్నారు. గుర్తుతెలియని యువతి వాట్సాప్‌ వీడియోకాల్‌ చేస్తుంది. అందులో అర్ధనగ్నంగా కనిపిస్తుంది. అశ్లీలంగా కవ్విస్తుంది. పొరపాటున కక్కుర్తి పడి ఆమె మాయలో పడిపోయామా, ఇక అంతే సంగతలు. పోక్సో చట్టం కింద కేసు పెడుతామని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతారు. గతంలో ఈ తరహా మోసాలు జరిగాయి. ఇప్పుడు కేవైసీ ముసుగులో కొత్త రకం చీటింగ్ కు సైబర్ నేరగాళ్లు తెరతీశారు. కేవైసీ పేరుతో వచ్చే ఫోన్లను నమ్మినా ఖాతా ఖాళీ కావడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొన్నటివరకు పేటీఎం పేరిట ఈ దందాకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు అప్‌డేట్‌ అయి ఎయిర్‌టెల్‌ కేవైసీ అంటూ నయా మోసాలకు తెరతీశారు.కేవైసీ ముసుగులో బ్లాక్‌మెయిల్‌ దందా పెరిగిపోయింది. పేటీఎం కేవైసీ కోసమంటూ గుర్తుతెలియని యువతులు వీడియోకాల్‌ చేసి అశ్లీలంగా మాట్లాడి, నగ్నంగా కనిపిస్తూ కవ్వించే ప్రయత్నం చేస్తారు. అప్పటికే ఆ కాల్‌ను రికార్డు చేసిన నేరగాళ్లు.. ‘ఆమె అశ్లీలంగా మాట్లాడుతుంటే మందలించాల్సిందిపోయి, అసభ్యకరంగా మాట్లాడుతావా. చిన్న పిల్లను చేసి గలీజు పనిచేస్తావా. ఆమె మైనర్‌. నీపై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసు పెడుతాం’ అని హెచ్చరిస్తారు. కేసులు వద్దనుకుంటే అడిగినంత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు. చాలామంది.. పరువు భయంతో లక్షలు ముట్టజెబుతున్నారు. ఈ తరహా ఫిర్యాదులు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో నమోదయ్యాయి. రాజస్థాన్‌ సైబర్‌ ముఠాలు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.పేటీఎం ముసుగులో మోసాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్‌ నేరగాళ్లు రూటు మార్చారు. ఎయిర్‌టెల్‌ కేవైసీ అంటూ కొత్త మోసానికి దిగారు. ‘కేవైసీని అప్‌డేట్‌ చేసుకోనందున మీ సిమ్‌ సేవలు కొద్దిసేపట్లో నిలిచిపోతున్నాయి. సేవలు కొనసాగాంటే ఈ నంబర్‌ను సంప్రదించండి’ అని ఓ ఫోన్‌ నంబర్‌ మెసేజ్‌ చేస్తారు.ఎవరైనా ఫోన్‌చేస్తే.. ‘నేను ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ను మాట్లాడతున్నా. మీ కేవైసీ అప్‌డేట్‌ కాలేదు. మీ సిమ్‌కార్డు సేవలు కొనసాగాలంటే రిమోట్‌ యాప్‌లైన క్విక్‌ సపోర్టు, టీమ్‌వ్యూయర్‌, ఎనీడెస్క్‌లో ఏదో ఒకటి డౌన్‌లోడ్‌ చేసుకోండి’ అని చెప్తారు. అది డౌన్‌లోడ్‌ చేసుకోగానే బాధితుడి ఫోన్‌లో జరిగే ప్రతి వ్యవహారం సైబర్‌ మోసగాడు తన ఫోన్‌ స్క్రీన్‌పై చూస్తుంటాడు. ఆపై ఎవరికైనా రూ.10 రీచార్జి, లేదంటే ఏదైనా పేమెంట్‌ చేయమని కోరుతారు. ఆ సమయంలో నేరగాడు బ్యాంకు ఖాతా వివరాలు, పిన్‌ నంబర్‌ తెలుసుకొని.. మన ఖాతాను ఖాళీ చేస్తాడు. ఇలా మోసపోయిన 11 మం ది ఇటీవల సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు.సిమ్‌కార్డుకు కేవైసీ అప్‌డేట్‌ అవసరం లేదు. సిమ్‌ తీసుకునప్పుడే సంబంధిత కంపెనీ అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటుంది. మళ్లీ కేవైసీ అప్‌డేట్‌ ఏమీ ఉండదు. అలా ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తి మెసేజ్‌,ఫోన్‌చేసినా అది మోసమే. ఎవరు కూడా వాట్సాప్‌లో అశ్లీల, అభ్యంతకరమైన వీడియోల్లో మాట్లాడేందుకు గుర్తుతెలియని యువతులు ప్రయత్నించినప్పుడు ఆ కాల్‌ను కట్‌ చేయండి. వాటికి దూరంగా ఉండండి. లేదంటే పోక్సో బెదిరింపులకు గురికావడంతోపాటు మానసిక ప్రశాంతతను పొగొట్టుకుని బాధపడాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.