కృష్ణా జిల్లాకు చెందిన బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో అంగన్ వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి మృతి చెందింది. నాగ అనూష, నాగ మల్లేశ్వరరావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు గూడవల్లి వర్షిణి(4) స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. రోజూ లాగే వర్షిణి అంగన్ వాడీ కేంద్రానికి బయలుదేరింది. అయితే ఆ చిన్నారితోపాటు చెల్లెలు స్నేహస్వాతి(3) కూడా మంగళవారం(మార్చి 16,2021) అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ పాము లోనికి వచ్చి కోడిగుడ్ల ట్రే పక్కన ఉన్న తాచుపాము, స్వాతిని కాటేసింది.

వెంటనే చేయి నొప్పిగా ఉందని చిన్నారి ఏడవడంతో అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది ఇంటికి పంపించారు. పాము కరిచిందనే అనుమానంతో కుటుంబీకులు తొలుత నాటువైద్యం చేయించారు. ఆ తర్వాత కృత్తివెన్ను మండలంలోని చిన్నపాండ్రాక ఆసుపత్రికి పాపను తీసుకెళ్లగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్లు పాప ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చిన్నారి ప్రాణాలు విడిచింది. కూతురి మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.