అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో అట్లాంటాకు తూర్పున ఉన్న ఆక్వర్త్‌లోని ఒక మసాజ్ పార్లర్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు, మరో రెండు స్పాలలో ఇంకో నలుగురు మరణించారని పోలీసులు చెప్పారు. ఇందులో ఆరుగురు ఆసియాకు చెందిన మహిళలు. ఈ మూడు దాడులకు కారణమని భావిస్తున్న ఓ 21 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆక్వర్త్‌లోని యంగ్ ఆసియన్ మసాజ్ సెంటర్‌లో మొదట కాల్పులు జరిగాయి. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా గాయపడిన మరో ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే అందులో ఇద్దరు మరణించారు. మరలా ఒక గంట వ్యవధిలోనే నార్త్ ఈస్ట్ అట్లాంటాలో ఉన్న గోల్డ్ స్పాలో దోపిడీ జరుగుతోందని పోలీసులకు ఫోన్ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా తూటా గాయాలతో రక్తపు మడుగులో ముగ్గురు మహిళల మృతదేహాలు కనిపించాయి. మరలా అరోమాథెరపీ స్పా నుంచి ఫోన్ రావడంతో పరుగుపరుగున అక్కడికి వెళ్లగా అక్కడ మరో మహిళ మృతదేహం తూటా గాయాలతో కనిపించింది.

ఈ మూడు ఘటనల తరువాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు జార్జియాలోని ఉడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్ ఆరోన్ లాంగ్ అనే 21 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ అనుమానితుడే మూడు చోట్లా కాల్పులు జరిపాడనడానికి గట్టి ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.