మంగళవారం ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం కూడా అలాగే ప్రారంభమై ఆ తరువాత కొంతసేపు లాభాల బాట పట్టి మరలా కిందకు దిగి మళ్ళీ పైకి లేచాయి. ఉదయం 11:30 గంటలకు ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేసిన అనంతరం అక్కడి నుంచి కిందకు పడడం మొదలుపెట్టిన సూచీలు ఇక ఏదశలోనూ కోలుకోకుండా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక పూర్తి నష్టాల్లోకి జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి.

ఉదయం 50,436 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 50,561 వద్ద గరిష్ఠాన్ని తాకిన అనంతరం 49,718 వద్ద కనిష్ఠానికి చేరుకుని చివరకు 562 పాయింట్లు నష్టపోయి 49,801 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ అయితే 14,946 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,956 వద్ద గరిష్ఠాన్ని తాకి ఆపైన 14,696 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 189 పాయింట్లు నష్టపోయి 14,721 వద్ద స్థిచతికిలపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.54 వద్ద నిలిచింది. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.

సీపీఎస్‌ఈ, ఆయిల్ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ రంగాల సూచీలు 3శాతానికి పైగా నష్టపోయాయి. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ లిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌, దివీస్‌ ల్యాబ్‌ షేర్లు లాభాలను ఆర్జిస్తే భారత్‌ పెట్రోలియం, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ముగిశాయి.