రివ్యూ రాజా (Review Raja) వార్తలు (News) వినోదం

చతుర్‌ ముఖం తెలుగు సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే??

చిత్రం పేరు: చతుర్‌ ముఖం;
నటీనటులు: మంజు వారియర్‌, సన్నీ వేన్‌, అలెన్సియర్‌ లోపేజ్‌ తదితరులు;
సంగీతం: డాన్‌ విన్సెంట్‌;
సినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజం;
ఎడిటింగ్‌: మనోజ్‌;
నిర్మాత: జిస్‌ టామ్స్‌, జస్టిస్‌ థామస్‌, మంజు వారియర్‌;
దర్శకత్వం: రంజిత్‌ కమలా శంకర్‌, సలిల్‌;
రచన: అభయ్‌ కుమార్‌, అనిల్‌ కురియన్‌;
విడుదల: ఆహా

ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగు లోకి డబ్‌/రీమేక్‌ చేయడం అనేది సాధారణంగా జరిగేదే! కానీ ఆ సినిమాలు చిత్రీకరణ జరుపుకొని, మన ప్రేక్షకులు చూడాలంటే సమయం పడుతుంది. అయితే ఇప్పుడు తాజా పరిస్థితులలో కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ వేదికలు కీలకంగా మారాయి. దీంతో ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల వారికీ ఓటీటీలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఏడాది కాలంగా ఇలాంటి ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఈ నేపథ్యంలో మలయాళంలో వచ్చిన మరో ఆసక్తికర చిత్రం ‘చతుర్‌ ముఖం’. తాజాగా ఈ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా తెలుగులో విడుదలైంది. ఈ సినిమా కథ ఎలా ఉంది? అనేది చూద్దాం!

కథా కమామీషు: తేజస్విని(మంజు వారియర్‌)కి సెల్‌ఫోన్‌ అంటే పిచ్చి. ఎప్పుడూ మొబైల్‌ చేతిలో ఉండాలి. సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయటం అలవాటు. మరోవైపు స్నేహితుడు ఆంటోని(సన్నీ వేన్‌)తో కలిసి సీసీటీవీ సొల్యూషన్‌ పేరుతో బిజినెస్‌ చేస్తూ ఉన్న సమయంలో ఊళ్లో జరిగే జాతరలో ఫొటోలు తీస్తుండగా తేజస్విని మొబైల్‌ నీటి కొలనులో పడిపోతుంది. మంచి ఫోన్‌ కొనుక్కొనే లోపు లోకల్‌ మొబైల్‌ వాడదామని ఆన్‌లైన్‌లో ఒక ఫోన్‌ బుక్‌ చేస్తుంది. ఆ ఫోన్‌ తేజస్విని దగ్గరికి వచ్చినప్పటి నుంచి అన్నీ వింతగా జరుగుతుంటాయి. తేజస్విని మొబైల్‌ బ్రాండ్‌నే వినియోగిస్తున్న మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ ఆ ఫోన్‌లో ఏముంది? ఆ మొబైల్‌ వాడిన ఇద్దరూ ఎందుకు చనిపోయారు? ఆ ఫోన్‌ వల్ల తేజస్వినికి వచ్చిన ఆపద ఏంటి?అనేదే సినిమా కథ!

కథ ఎలా ఉందంటే: ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవినైనా నడిపించాలంటే శక్తి ఉండాల్సిందే. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన శక్తి ఉంటుంది. శరీరం నశించినప్పుడు ఆ శక్తి మరో ప్రాణిలోకి లేదా వస్తువులోకి ప్రవేశిస్తుందని చాలా మంది నమ్ముతారు. మంచి శక్తి ఉంది అంటే దుష్టశక్తి కూడా ఉంటుంది. ‘చతుర్‌ ముఖం’ ఇలాంటి విషయాల చుట్టూ తిరిగే కథ. ఇది ఒక టెక్నో థ్రిల్లర్‌. తేజస్వినిలాంటి యువత స్మార్ట్‌ఫోన్‌కు ఎలా బానిసలవుతున్నారన్న విషయాన్ని చెబుతూ కథను నెమ్మదిగా ప్రారంభించిన దర్శకుడు తేజస్విని సెల్‌ఫోన్‌ పోవడం, ఆ తర్వాత కొత్త మొబైల్‌ రావటం, అది వచ్చిన దగ్గరి నుంచి వింతలు జరగడం తదితర సన్నివేశాలను చూస్తుంటే ఇదేదో దెయ్యం కథేమో అని ప్రేక్షకుడు భావించేలా చేస్తాడు. అయితే, ఫోన్‌ వెనుక ఉన్న మతలబు ఏంటో తెలుసుకునేందుకు తేజస్విని చేసే ప్రయత్నంలో ఆమెకు ఊహించని విషయాలు తెలుస్తాయి. విరామ సమయానికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి, కథ, కథనాలపై మరింత ఆసక్తి పెంచాడు. ఆ బ్రాండ్‌ ఫోన్‌ వాడుతున్న వాళ్లు ఎలా చనిపోతున్నారన్నది ఆంటోనీ, ప్రొఫెసర్‌లతో కలిసి తేజస్విని కనుక్కొనే ప్రయత్నంతో ద్వితీయార్ధం నడుస్తుంది. ఆయా సన్నివేశాలు ఉత్కంఠగా అనిపిస్తాయి. అక్కడక్కడా రజనీ-శంకర్‌ల ‘2.ఓ’ తాలూకూ సన్నివేశాలు ప్రేక్షకుడికి స్పురణకు వస్తాయి. పతాక సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా సాగుతాయి. ప్రొఫెసర్‌ చేసిన పని కారణంగా ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా? అన్న రీతిలో ఒక ప్రశ్న వేసి వదిలేశాడు దర్శకుడు. అయితే, హారర్‌ చిత్రాలు నిడివి ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటాయి. ‘చతుర్‌ముఖం’ 2 గంటలా 15 నిమిషాలు ఉంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు, పాటలకు కత్తెర వేసి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది.

ఎవరెలా నటించారు: ‘చతుర్‌ ముఖం’లో నటించిన ప్రేక్షకులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కాదు. అయినప్పటికీ ఎక్కువ తికమక లేకుండా నాలుగైదు పాత్రలతో దర్శకుడు కథా, కథనాలను నడిపించాడు. కీలక పాత్రలో నటించిన మంజు వారియర్‌, సన్నీ వేన్‌, అలెన్సియర్‌ లోపేజ్‌ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికంగా సినిమా బాగుంది. డాన్‌ విన్సెంట్‌ సంగీతం, అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. మనోజ్‌ ఎడిటింగ్‌ ఓకే. కాస్త నిడివి పెరిగింది. అభయ్‌ కుమార్‌, అనిల్‌ కురియన్‌ అనుకున్న కథను దర్శకులు రంజిత్‌ కమలా శంకర్‌, సలల్‌ చక్కగా చూపించారు. అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయం తీసుకున్నా, ఓవరాల్‌గా మంచి థ్రిల్లర్‌ చూశామన్న భావన ప్రేక్షకుడిలో కలుగుతుంది. సెల్‌ఫోన్స్‌, రేడియేషన్‌ ఇలా మానవ జీవితంపై ప్రభావితం చేసే అంశాలను దర్శకుడు టచ్‌ చేసే ప్రయత్నం చేశాడు. సైన్స్‌, నెగెటివ్‌ ఎనర్జీ ఇలా కొన్ని టెక్నికల్‌ అంశాలు సామాన్యుడికి కాస్త అర్థంకాకపోవచ్చు.

బలాలు
కథ
నటీనటులు
సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు
అక్కడక్కడా కాస్త నెమ్మదిగా సాగే కథనం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •