వార్తలు (News)

రేపటి నుండి శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు!!

భూ కైలాసగిరి శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఈనెల 18 నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దశల వారీగా స్పర్శ దర్శనాలు కల్పించాలని ఆలయ ఈవో కేఎస్ రామారావు నిర్ణయించారు. గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా కల్పించాలని, అలాగే సామూహిక అభిషేకాలు కూడా నాలుగు విడుతలుగా కల్పించాలని, వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు.

ఆన్ లైన్ ద్వారా కరెంటు బుకింగ్, అభిషేకం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో జరిగే సేవలన్నీ ఆన్ లైన్ ద్వారా, కరెంటు బుకింగ్ ద్వారా చేసుకునే సదుపాయం యధావిధిగా కొనసాగుతుందని, గతంలో మాదిరే అర్జిత కుంకుమార్చన, నవావరణ అర్చన, వృద్ధ మల్లికార్జునస్వామి వారి అర్జిత అభిషేకాలు పరిమిత సంఖ్యలో కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా అంటే ఉదయం 7 గంటలకు తొలి విడుత, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో విడుత, తిరిగి రాత్రి 7.30 గంటలకు మూడో విడుత బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు. బ్రేక దర్శనానికి రూ.500 టికెట్ గా నిర్ణయించారు. అంతేకాదు గతంలో మాదిరే ఈసారి కూడా వేద ఆశీర్వచనం కూడా పునః ప్రారంభిస్తున్నారు. రోజుకు నాలుగు విడుతలుగా వేద ఆశీర్వచనం నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది.

శ్రీశైలంలో దర్శనానికి వచ్చే భక్తులు ఆలయంలోను బయటా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయాలని, ఆలయంలోకి అడుగుపెట్టే ముందే శానిటైజ్ చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు.

స్వామి అమ్మవారల స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు, అర్జిత సేవలు జరుపుకునే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుందని దేవస్థానం స్పష్టం చేసింది. పురుషులు పంచె, కండువాలను, మహిళలు తగిన సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించి రావాల్సి ఉంటుందన్నారు. ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించే రీతిలో దుస్తులు ధరించి రావడం పూర్తిగా నిషేధించామని దేవస్థానం తెలియజేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •