ఏపీ రవాణా మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదనంగా మరో కీలక బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం రవాణ, సమాచార శాఖ బాధ్యతలు చూస్తున్న పేర్ని నానికి కొత్తగా సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించారు. ఇప్పటివరకు సినిమటోగ్రఫీ శాఖను సీఎం వైఎస్ జగన్ చూస్తున్నారు. తాజాగా ఆ శాఖనే పేర్ని నానికి బదిలీ చేశారు.

రెండున్నరేళ్లుగా సినిమాటోగ్రఫీ శాఖ సీఎం జగన్ వద్దే ఉంది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు, స్టార్ హీరోలు సీఎంనే కలిసి తమ సమస్యలను వివరిస్తున్నారు. ఐతే ఇటీవల సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానం విషయంలో పేర్ని నాని కీలకంగా వ్యవహరించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఆయనే చర్చలు జరిపారు.

అలాగే సీఎం జగన్ పై వచ్చిన విమర్శలకు పేర్ని నాని గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయడంలో పేర్ని నానీనే ముందుంటారు. అటు సినిమా వాళ్లతో చర్చించడం ఇటు పవన్ కు గట్టిగా కౌంటర్లు ఇవ్వడంతోనే తనదగ్గరున్న శాఖను పేర్ని నానికి ఇచ్చినట్లు సమాచారం.

ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలను అసెంబ్లీ ఆమోదించిన తర్వాత సినీ పరిశ్రమ చేసిన విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకెళ్లడం మాత్రమే చేయగలిగామని పేర్ని నాని అప్పట్లో చెప్పారు. సినిమాటోగ్రఫీ శాఖ సీఎం దగ్గరే ఉండటంతో అప్పుడు పేర్ని అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా అదే శాఖ ఆయన వద్దకు రావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇలా ఉండగా ఏపీలో సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోనెం.35ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. పాత పద్ధతిలోనే టికెట్లను విక్రయించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఐతే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజినల్ బెంచ్ లో సవాల్ చేసింది. తీర్పు ఇంకా వెలువడలేదు.