తూర్పు కోస్తా రైల్వే డివిజన్‌ పరిధిలో పలు ప్రత్యేక రైళ్లను పాసింజర్లుగా మార్పు చేసి వాటికిగాను ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్‌-19 తరువాత అంచలంచెలుగా ప్రత్యేకం పేరుతో పలురైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చిన రైల్వే దశల వారీగా వాటిని రెగ్యూలర్‌గా మార్పు చేసింది. కానీ కొన్ని పాసింజర్‌ సర్వీసులను పూర్తిగా అందుబాటులోకి తీసుకురాలేదు. అందుబాటులోకి తీసుకొచ్చిన పాసింజర్‌ రైళ్ల టిక్కెట్‌ ధరలను మాత్రం ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలుగా కొనసాగిస్తూ ప్రయాణికులపై భారం మోపుతోంది.

విశాఖ-పలాస-విశాఖ, విశాఖ-రాయగడ-విశాఖ ఇప్పటివరకు పాసింజర్‌ రైళ్లుగా ఉండగా ఆ రైళ్లకు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్ల ధరలను నిర్ణయించారు. దీంతో రైల్వే అధికారుల తీరుపై పలువురు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాసింజర్‌ రైళ్లకు సంబంధించిన హాల్ట్‌లను కొనసాగిస్తూ ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగానే ఆయా రైళ్లకు ఆదరణ కొరవడుతోందనే వాదన వినిపిస్తోంది. పలుమార్లు కనీస ప్రయాణికులు లేకుండానే అవి రాకపోకలు సాగిస్తున్నా కూడా ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్ల ధరలే కొనసాగుతున్నాయి.