నేడు ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో గాడిద పాలకు మంచి డిమాండ్‌ ఉంది. గాడిదపాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం చేస్తూ పాలను విక్రయిస్తున్నారు. గాడిద పాలు తాగే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ఈ పాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. కరము పాలు గరిటడైనా చాలు అన్నట్లుగా.. గాడిద పాలు తాగితే పలు రకాల మొండి వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని గాడిద పాల విక్రయదారులు నొక్కి వక్కాణిస్తున్నారు.

ఇందులో నిజమెంతో తెలీదు కానీ, గాడిద పాలను కూడా అనేక మంది కొనుగోలు చేసి తాగుతున్నారు. మంచిర్యాలకు చెందిన కొంతమంది యువకులు గాడిదలను తీసుకుని ప్రతి సంవత్సరం ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు పాల్వంచ పట్టణ, మండలంలో ఊరూరా తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు.

పాలు కావాలంటే ఇంటివద్దనే గాడిదపాలను పితికి అక్కడిక్కడే ఇస్తారు. అర టీ కప్పు గాడిద పాలు చిన్న పిల్లలకు రూ.150, పెద్దలకు ఒక టీ కప్పు రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ గాడిద పాల విక్రయదారులు రోజుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు సంపాదిస్తున్నట్లు, గిరాకీ ఉంటే అంతో ఇంతో ఆదాయం లభిస్తుందని, అది కూడా గాడిద పాల గురించి తెలిసిన వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు.

టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయని దీంతో గాడిద పాలకు కాస్తా గిరాకీ తగ్గిందని.. దగ్గు, దమ్ము, ఆస్మా, గురక వంటి వ్యాధులను గాడిద పాలు తాగితే పూర్తిగా తగ్గిపోతాయని, ఈ పాలల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయని నిర్వాహకులు ప్రచారం చేస్తూ గాడిద పాలను విక్రయిస్తున్నారు.

ఆవు, గేదె, మేక పాలకు ఉన్న గిరాకీ గాడిద పాలకు ఉండటం లేదు. అయితే గాడిద పాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తాగడం ద్వారా చిన్నారులకు, పెద్దలకు పలు రకాల వ్యాధులు నివారణ అవుతాయి. చాలామంది ఈ పాలు తీసుకోవడం వలన అనేక రకాల మొండి వ్యాధులు తగ్గుతాయి.