రాష్ట్రంలోని అర్బన్‌ ప్రాంతాల్లో నేరాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. రాజమండ్రి అర్బన్‌ యూనిట్‌ పరిధి మినహా అన్ని అర్బన్‌ ప్రాంతాల్లో గడిచిన ఏడాది కాలంలో ఎక్కువ కేసులు నమోదైనట్టు సమాచారం. అయితే వీటిలో అత్యధికం మహిళలపై వేధింపులు, రౌడీషీటర్ల దౌర్జన్యాలు, సైబర్‌ నేరాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో దొంగతనాలు, ఇళ్ల స్థలాలకు సంబధించిన భూ తగాదాల కేసులు ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై దాడుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

తిరుపతి అర్బన్‌, విశాఖపట్నం సిటీ, విజయవాడ సిటీ, గుంటూరు అర్బన్‌ ప్రాంతాల్లో నేరాల రేట్‌ బాగా పెరిగింది. తిరుపతి అర్బన్‌ పరిధిలో 2020లో 2,357 కేసులు నమోదైతే 2021లో 58 శాతం క్రైమ్‌రేట్‌ పెరిగి 3,715 కేసులు నమోదయ్యాయి. అలాగే విశాఖపట్నం సిటీ పరిధిలో 2020లో 5,912 కేసులు నమోదైతే 2021లో 8,041 కేసులు నమోదయ్యాయి. 36 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో 2020లో 6,350 కేసులు నమోదైతే గతేడాది 30 శాతం అధికంగా 8,243 కేసులు నమోదయ్యాయి. గుంటూరు అర్బన్‌లో 2020లో 4,287 కేసులు నమోదైతే 2021లో 18 శాతం అధికంగా 9,015 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 2020లో 9,975 కేసులు నమోదు కాగా గతేడాది 14,171 కేసులు నమోదయ్యాయి.

విశాఖపట్నం అర్బన్‌ ప్రాంతంలో ఎక్కువగా క్రైమ్‌రేట్‌ నమోదవగా, విశాఖపట్నం రూరల్‌ పరిధిలో గతేడాది కంటే గణనీయంగా తగ్గాయి. 2020లో 5,857 కేసులు నమోదైతే 2021లో 30 శాతం క్రైమ్‌రేట్‌ తగ్గి 4,743 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, విజయనగరం, చిత్తూరు జిల్లాల పరిధిలో క్రైమ్‌రేట్‌ తగ్గింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే సాంకేతికంగా ప్రతి ముఖ్యమైన కూడళ్లు, వాణిజ్య సముదాయాల ప్రాంతాల్లో సిసి కెమెరాలతో నిఘాలను పెంచుతున్నా క్రైమ్‌రేట్‌ గణనీయంగా పెరుగుతుండటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.