పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గతంలో ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్‌ను ఆరు రోజుల పాటు వాయిదా వేస్తూ ఈ ఎన్నికలను ఫిబ్రవరి 20న నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు గురు రవిదాస్‌ జయంతి వేడుకలు ఉండటంతో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీని మార్చాలని అధికార కాంగ్రెస్‌ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఈసీ ఇటీవల ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్‌ జరగాల్సి ఉండగా ఫిబ్రవరి 16న యూపీలోని బెనారస్‌లో గురు రవిదాస్‌ జయంతి ఉత్సవాలు ఉన్నాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలు ముందే ప్రారంభమవుతాయి. పైగా, జయంతి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి తరలి వెళ్లనున్నారు.. దీంతో వారంతా ఓటు వేసే అవకాశం కోల్పోతారని పార్టీలు ఈసీకి విన్నవించడంతోపాటు పోలింగ్‌ తేదీని వారం పాటు వాయిదా వేయాలని స్వయంగా పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ విజ్ఞప్తి చేశారు. ప్రధాన పార్టీలైన బీఎస్పీ, భాజపా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పోలింగ్‌ తేదీని ఫిబ్రవరి 20కి మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్‌ని ప్రకటించింది.

మార్చిన కొత్త షెడ్యూల్ వివరాలు..
జనవరి 25న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నామినేషన్లకు తుది గడువు తేదీగా ఫిబ్రవరి 1 ను నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలనకు తుది గడువుగా ఫిబ్రవరి 2 ను నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు తేదీగా ఫిబ్రవరి 4 ను నిర్ణయించారు. ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 20 న జరగనుంది. ఓట్ల లెక్కింపును మార్చి 10 న నిర్వహించనున్నారు.